Share News

804.63 కోట్లతో 98 వంతెనల పునర్నిర్మాణం

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:57 AM

రాష్ట్రంలో రహదారులపై ఉన్న వంతెనల దుస్థితిపై రోడ్లు భవనాల శాఖ స్పందించింది. రూ.804.63 కోట్లతో 98 కొత్త వంతెనల పునర్నిర్మాణం చేపడతామని తెలిపింది.

804.63 కోట్లతో 98 వంతెనల పునర్నిర్మాణం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆర్‌అండ్‌బీ శాఖ స్పందన

  • వంతెనల పునర్నిర్మాణంపై ప్రభుత్వానికి ఫైలు పంపామని వెల్లడి

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారులపై ఉన్న వంతెనల దుస్థితిపై రోడ్లు భవనాల శాఖ స్పందించింది. రూ.804.63 కోట్లతో 98 కొత్త వంతెనల పునర్నిర్మాణం చేపడతామని తెలిపింది. నిధుల పరిపాలనా అనుమతి కోసం ఫైలును ప్రభుత్వ ఆమోదం కోసం పంపించామని వెల్లడించింది. రాష్ట్రంలో రహదారి వంతెనలు అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్న అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 27న ‘బాబోయ్‌ బ్రిడ్జ్‌లు’ శీర్షికన వార్తను ప్రచురించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రమాదకరస్థితికి చేరుకున్న బ్రిడ్జిల ఫొటోలతో కథనాన్ని వెలువరించింది. ఈ వార్తకు రోడ్లు భవనాల శాఖ స్పందించింది. రాష్ట్రంలో జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులపై 5,969 వంతెనలు ఉంటే, అందులో 4,614 సురక్షితంగా ఉన్నాయని ఆర్‌అండ్‌బీ తెలిపింది. ఇందులో 1,007 బ్రిడ్జీలకు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉందని వివరించింది. 98 బ్రిడ్జీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని పునర్‌నిర్మించాల్సి ఉందని ఆ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో వంతెనల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారని ఆ శాఖ తెలిపింది.

Updated Date - Jun 30 , 2026 | 04:58 AM