Share News

ఉపాధిలో మట్టిరోడ్లు

ABN , Publish Date - May 12 , 2026 | 05:52 AM

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మైలురాయిగా నిలిచిన ఉపాధి హామీ పథకం మరో ముందడుగు వేస్తోంది. మౌలిక వసతులంటే సిమెంట్‌ రోడ్డు, డ్రైన్లు, భవనాల నిర్మాణమే కాదు, పేదల పొలాల్లోకి రహదారి సౌకర్యం కల్పించి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆదాయం ...

ఉపాధిలో మట్టిరోడ్లు

  • పేదల పోలాలకు బాటలు

  • 10 వేల కి.మీ మేర నిర్మించేందుకు సన్నాహాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మైలురాయిగా నిలిచిన ఉపాధి హామీ పథకం మరో ముందడుగు వేస్తోంది. మౌలిక వసతులంటే సిమెంట్‌ రోడ్డు, డ్రైన్లు, భవనాల నిర్మాణమే కాదు, పేదల పొలాల్లోకి రహదారి సౌకర్యం కల్పించి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెంచాలని నిర్ణయించింది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత మొదట సిమెంట్‌ రోడ్లు 4 వేల కి.మీలు నిర్మించారు. రెండో ఏడాది సిమెంట్‌ రోడ్లతో పాటు తారురోడ్లు, మ్యాజిక్‌డ్రైన్లు 6 వేల కి.మీల మేర నిర్మించారు. ఇవన్నీ ఉపాధి పథకంలో మెటీరియల్‌ నిధులతో నిర్మించినవే. అయితే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడే పుంతరోడ్లపై దృష్టి సారించారు. జిల్లాల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది 10 వేల కి.మీ మేర మట్టిరోడ్లు నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా..

ఉపాధి పథకంలో మెటీరియల్‌ నిధులతో పలు రకాల కమ్యూనిటీ, వ్యక్తిగత ఆస్తుల కల్పనకు సంబంధించిన పనులు చేపట్టే అవకాశముంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా మన రాష్ట్రంలో ఈ పథకం ద్వారా వివిధ రకాల పనులు చేపట్టారు. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత సుమారు 40 వేలకు పైగా పశువులకు షెడ్లు నిర్మించి ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో మూగ జీవాలకు ఎండాకాలంలో ప్రతి గ్రామంలోనూ తాగునీటికి ఇబ్బంది లేకుండా తాగునీటి తొట్టెలు నిర్మించారు. సిమెంట్‌రోడ్లతో పాటు మ్యాజిక్‌ డ్రైన్లు, ఉద్యానవన పంటలు అభివృద్ధి చేశారు. అయితే గ్రామాల్లో మట్టిరోడ్లు కావాలని పేద రైతులు కోరుతున్నారు. ఈమేరకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో, మట్టిరోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు.

దారులు లేక పొలాల్లో ఇబ్బందులు

గ్రామీణ ప్రాంతాల్లో పొలాల మధ్య రహదారి సమస్య ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తోంది. దారులున్నా.. అవి ఆక్రమణకు గురికావడంతో పొలాల్లో పండిన పంటలు మార్కెట్‌కు చేరాలంటే వ్యయం అధికమవుతోంది. అంతే కాకుండా ప్లాన్‌లో ఉన్న దారులను సైతం కొందరు ఆక్రమించుకోవడంతో గ్రామాల్లోని పొలాల మధ్య దారుల వివాదాలు పెరిగాయి. అలాంటి చోట్ల మట్టిరోడ్లు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశముందంటున్నారు. చాలా చోట్ల రైతులు మాగాణుల్లో సైతం రోడ్లు లేక రవాణా కోసం రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తోంది. పొలాల్లోకి మట్టిరోడ్లు వేయడం ద్వారా వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించే అవకాశముందంటున్నారు.

Updated Date - May 12 , 2026 | 05:52 AM