రాష్ట్రంలో 10 కొత్త విమానాశ్రయాలు
ABN , Publish Date - May 23 , 2026 | 04:13 AM
రాష్ట్రంలో విమానాశ్రయాల కనెక్టివిటీని విస్తరించేందుకు ప్రభుత్వం వేగవంతమైన ప్రణాళికలను అమలు చేస్తోంది.
కుప్పం, నాగార్జునసాగర్, ఒంగోలు.. అనంతపురం, తుని, అన్నవరంలలో ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ భారీగా పెంపు
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విమానాశ్రయాల కనెక్టివిటీని విస్తరించేందుకు ప్రభుత్వం వేగవంతమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు విమానాశ్రయాలతో పాటు మరో 10 ఎయిర్ పోర్టులను నిర్మించేందుకు రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ సన్నద్ధమైంది. డ్రోన్స్‌ను కూడా వినియోగంలోనికి తీసుకురావడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ భావిస్తోంది. ఇప్పటికే నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తయిన భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
పది విమానాశ్రయాలు ఇవీ..
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 10 విమానాశ్రయాలను నిర్మించాలని భావిస్తోంది. వీటిలో నెల్లూరు జిల్లాలోని దగదర్తి, చిత్తూరు జిల్లాలోని కుప్పం, రాజధాని అమరావతి, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అనంతపురం, కాకినాడ జిల్లాలోని తుని, అన్నవరం సహా మరో చోట విమానాశ్రయ నిర్మాణాలను చేపట్టనుంది. వీటికి కార్యాచరణను శరవేగంగా చేపడుతోంది.
వాటర్ డ్రోన్స్
రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణంతో పాటు.. డ్రోన్స్ సేవలనూ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వాటర్ డ్రోన్స్‌పై మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రకాశం, గండికోట, శ్రీశైలం, విశాఖపట్నం, అరకు, లంబసింగి, తిరుపతి, కోనసీమ ప్రాంతాల్లో వాటర్‌డ్రోన్స్ వినియోగంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది వాటర్ డ్రోన్స్ స్థాపనకు కేంద్ర అనుమతులు లభించగా.. విశాఖలో రక్షణ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ప్రకాశం, శ్రీశైలం, అరకు, లంబసింగి, గండికోట ప్రాంతాలకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్ఏ) నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ రావాల్సి ఉంది.