రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు
ABN , Publish Date - May 19 , 2026 | 04:27 AM
ఇంధన భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
న్యూక్లియర్ ఎకానమీలో నమ్మకమైన భాగస్వామిగా ఏపీ
గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధం
ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక, సమగ్ర దృక్పథం
డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి: మంత్రి లోకేశ్
న్యూఢిల్లీ, మే 18(ఆంధ్రజ్యోతి): ఇంధన భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీని భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని తెలిపారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఈఐ), యూఎ్‌స-ఇండియా స్ర్టాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (యూఎ్‌సఐఎ్‌సపీఎఫ్) సంయుక్తంగా యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు లోకేశ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్, మాడ్యులర్ తయారీ, సప్లయ్ చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగం నమూనాలకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీరంగంలో విస్తృతి, ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయని తెలిపారు. ఏపీ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్‌ఫ్రా, పోర్టులు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఇవి దేశానికీ, రాష్ట్రానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తాయన్నారు.
ఏపీలో అనేక అవకాశాలు
‘ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. మాకు సువిశాలమైన తీరప్రాంతం, శక్తిమంతమైన పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విస్తృతమైన పారిశ్రామిక కారిడార్లు, ప్రతిష్టాత్మకమైన పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నాం. పారిశ్రామికీకరణలో వేగం, అమలు అత్యంత ముఖ్యం. ఇందులో న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ప్రముఖ పాత్ర వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్ సాంకేతికతల అమలుకు విశ్వసనీయ గ్లోబల్ భాగస్వాములతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచదేశాలు ఏకకాలంలో ఆర్థికవృద్ధి, పారిశ్రామిక వ్యాప్తి, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డీకార్బనైజేషన్ ఏవిధంగా సాధించాలనే ఆలోచన చేస్తున్నాయి. క్లైమేట్ కమిట్మెంట్లను పాటిస్తూ ఏఐ యుగాన్ని ఎలా ముందుకు నడిపించాలి? అందుకు అవసరమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుతో ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇంధన భద్రతను ఏవిధంగా సాధించాలనేవి తక్షణ సవాళ్లుగా మారాయి. ఏపీ అభివృద్ధి ఆకాంక్షలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇంధన భద్రత మాకు అత్యంత ప్రాధాన్య అంశం. దేశంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా ఏపీ మారింది. మేం కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం. ఎలకా్ట్రనిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. విశాఖను ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్ తరం పరిశ్రమలకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్‌ను నిర్మిస్తున్నాం. ఇందులోకి భారీ పరిమాణంలో విశ్వసనీయ విద్యుత్ అవసరం ఉంటుంది. అందుకే ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక, సమగ్ర దృక్పథాన్ని ఏపీ అవలంబిస్తోంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో రెన్యూవబుల్స్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, గ్రిడ్ ఆధునికీకరణ రంగాల్లో సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నాం. మా దృష్టిలో డేటా సెంటర్ అంటే కేవలం సర్వర్లతో కూడిన భవనాలకు ఆతిథ్యమివ్వడం కాదు.
డేటా సెంటర్ ఎకోసిస్టమ్ చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ కూడా నిర్మించాలన్నదే మా లక్ష్యం. మేం కేవలం భూమి, విద్యుత్ గురించి మాత్రమే కాకుండా ఫుల్ స్టాక్ గురించి ఆలోచిస్తున్నాం. కూలింగ్ సిస్టమ్స్‌ను స్థానికంగా తయారు చేయడం, పవర్ ఎలకా్ట్రనిక్స్ ఎకోసిస్టమ్‌లను నిర్మించడం, ట్రాన్స్‌ఫార్మర్స్ తయారీని ప్రోత్సహించడం, బ్యాటరీ స్టోరేజి సప్లయ్ చైన్స్, సెమీకండక్టర్-అనుసంధాన పరిశ్రమలను ఆకర్షించడంపై దృష్టి సారించాం. ప్రాజెక్టుల వారీగా కాకుండా వివిధ దశల్లో క్లస్టర్లవారీగా సామర్థ్యాన్ని పెంచేందుకు కృషిచేస్తున్నాం. న్యూక్లియర్ ఎనర్జీ ఒక పూర్తి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా మారుతుంది. పూర్తిగా న్యూక్లియర్ వాల్యూ చైన్‌లో ఏపీ భాగస్వామ్యం కావడమే మా లక్ష్యం. న్యూక్లియర్ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను నిర్మించడానికి ఇది సరైన సమయమని మేం భావిస్తున్నాం. న్యూక్లియర్ ఎనర్జీ పాత్ర లేకుండా భారీ కర్బన ఉద్గారాల తగ్గింపు, పారిశ్రామికస్థాయి విద్యుదీకరణకు విశ్వసనీయ మార్గంలేదని ప్రపంచదేశాలు క్రమంగా గుర్తిస్తున్నా యి. ఏఐ విప్లవం ఈ గుర్తింపును మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగస్వామ్యం వహించాలని ఏపీ కోరుకుంటోంది. ఏపీ భవిష్యత్తు కోసం ఎనర్జీ, పారిశ్రామిక పునాదులను నిర్మిస్తున్న తరుణంలో మేము దీర్ఘకాలిక దార్శనికతను పంచుకునే గ్లోబల్ నేతలతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాం. ఇక్కడ అవకాశాలు అపారమైనవి’ అని లోకేశ్ స్పష్టం చేశారు.