Share News

ఆధ్యాత్మిక యాత్రలో విషాదం

ABN , Publish Date - May 23 , 2026 | 05:56 AM

ఆధ్యాత్మిక పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఏపీకి చెందిన 60 మంది ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా నేపాల్‌కు బయల్దేరగా..

ఆధ్యాత్మిక యాత్రలో విషాదం

  • గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి ఆధ్యాత్మిక పర్యటనకు నేపాల్‌ బయల్దేరిన 60 మంది

  • లఖ్‌నవూ నుంచి అయోధ్య వెళ్తుండగా బస్సు ప్రమాదం

  • బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడిన బస్సు

  • నరసరావుపేటకు చెందిన టూర్‌ గైడ్‌, బస్సు డ్రైవర్‌ మృతి

  • మరో 11 మందికి గాయాలు... పర్యటన రద్దు

నరసరావుపేట/గుంటూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఏపీకి చెందిన 60 మంది ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా నేపాల్‌కు బయల్దేరగా.. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వారిలో నరసరావుపేటకు చెందిన టూర్‌ గైడ్‌ శివ నాగ కుమార్‌ (44)తోపాటు.. అక్కడి బస్సు డ్రైవర్‌ ఉన్నారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన 60 మంది పది రోజుల నేపాల్‌ పర్యటన నిమిత్తం బయల్దేరారు. నరసరావుపేటకు చెందిన శివనాగకుమార్‌ ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. ఈ బృందం గురువారం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు వెళ్లింది. మొదటిరోజు లఖ్‌నవూలోని పలు ప్రాంతాలను సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైమిశారణ్యం నుంచి అయోధ్య రామమందిరానికి వెళ్లేందుకు అక్కడ టూరిస్ట్‌ బస్సు మాట్లాడుకున్నారు. బయల్దేరిన 15 నిమిషాల్లోనే జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగశివకుమార్‌, అక్కడి బస్సు డ్రైవర్‌ మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. శివనాగకుమార్‌ మృతి చెందిన విషయం తెలియగానే బస్సులోనే ఉన్న ఆయన తండ్రి వీరభద్రం షాక్‌తో గుండెపోటుకు గురయ్యారు. ఆయనతోపాటు గాయపడిన వారిని కూడా అక్కడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో యాత్రికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాస్తవానికి గురువారం (మే 21న) ప్రారంభమైన నేపాల్‌ పర్యటన ఈ నెల 31తో ముగియాల్సి ఉంది.


స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

పల్నాడు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైన విషయం ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా తెలుసుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే స్పందించి సహాయచర్యలు పర్యవేక్షించారు. యాత్రికులతో మాట్లాడి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి అధికారులతో కూడా మాట్లాడి వారంతా వెనక్కి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

Updated Date - May 23 , 2026 | 05:57 AM