Share News

పీహెచ్‌సీల పనితీరు భేష్‌

ABN , Publish Date - May 19 , 2026 | 04:37 AM

గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి.

పీహెచ్‌సీల పనితీరు భేష్‌

  • 312 కేంద్రాలకు ‘ఏ’ గ్రేడ్‌

  • ‘బీ’ గ్రేడ్‌ దక్కించుకున్న 455

  • గత ఏడాదితో పోలిస్తే మెరుగు

  • మంత్రికి చేరిన హెచ్‌ఎంఐఎస్‌ నివేదిక

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ(హెచ్‌ఎంఐఎస్)లో నమోదు చేసిన వివరాల ప్రకారం పీహెచ్‌సీల పనితీరును శ్రేణుల వారీగా గుర్తించి, సదరు నివేదికలను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌(డీహెచ్‌) డాక్టర్‌ పద్మావతి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు అందించారు. ఓపీ, ఐపీ, ల్యాబ్‌ టెస్ట్‌లు, ప్రసవాలు, ఇతర సేవల విషయంలో పీహెచ్‌సీలు ముందంజలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చిలో 1,144 పీహెచ్‌సీల్లో 312 పీహెచ్‌సీలకు ‘ఏ గ్రేడ్‌’ గుర్తింపు లభించింది. గత ఏడాది అక్టోబరు కేవలం 107 పీహెచ్‌సీలకు ‘ఏ గేడ్‌’ గుర్తుంపు రాగా.. ఈ విడతలో అవి మూడు రేట్లు పెరిగాయి. ‘బీ గ్రేడ్‌’ గుర్తింపు పొందిన ఆసుపత్రుల సంఖ్య 354 నుంచి 455కు పెరిగాయి. మరోవైపు.. సీ, డీ, ఈ గ్రేడుల ఆసుపత్రుల సంఖ్య తగ్గుతోంది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు నెలల వారీగా 1144 పీహెచ్సీల పనితీరు మదింపు వివరాలను డీహెచ్‌ తన నివేదికలో పొందుపరించారు. ప్రస్తుతం సీ గ్రేడ్‌లో 298, డీ గ్రేడ్‌లో 72, ఈ గ్రేడ్‌లో 7 చొప్పున ఉన్నాయి. ఓపీ, ఐపీ, ల్యాబ్‌ టెస్ట్‌లు, ప్రసవాలకు ఒక్కొక్క మార్కు చొప్పున ఐదు మార్కులను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్‌లు కేటాయించారు. అన్నమయ్య జిల్లాలో కురబలకోట పీహెచ్‌సీ అక్టోబరు నుంచి మార్చి వరకు ప్రతి నెలా ఏ గ్రేడ్‌లో నిలిచింది.


తూర్పుగోదావరి జిల్లాలోని బ్రాహ్మణగూడెం, చాగల్లు, నల్లజర్ల పీహెచ్‌సీలు వరుసగా ఆరుసార్లు ప్రథమ శ్రేణిలో నిలిచాయి. కాకినాడ జిల్లాలో తేటగుంట పీహెచ్‌సీ ఆరుసార్లు ఏ గ్రేడ్‌ సాధించింది. ఇలా ప్రతి జిల్లాలో కొన్ని ఆరోగ్య కేంద్రాలు ఐదు నుంచి మూడుసార్లు ఏ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 72 పీహెచ్‌సీలు డీ గ్రేడ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే 10 ఉన్నాయి. అల్లూరి జిల్లాల్లో 9, పోలవరం జిల్లాలో 8 ఇలా ఇతర జిల్లాల్లో కొన్ని పీహెచ్‌సీలు డీ గ్రేడ్‌ కేటగిరిలో నిలిచాయి.

Updated Date - May 19 , 2026 | 04:42 AM