Share News

సామాజిక భద్రతలో ఏపీ భేష్‌

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:35 AM

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ) అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ..

సామాజిక భద్రతలో ఏపీ భేష్‌

  • ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలకు ప్రశంసలు

  • జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలపై కేంద్రం అధ్యయనం

  • పది రాష్ట్రాల్లో సమాచార సేకరణ.. అనేక అంశాల్లో ఏపీనే అత్యుత్తమం

  • అధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, హరియాణా

అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ) అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఏఎంఎస్‌) నిర్వహించిన సమగ్ర ప్రభావ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ వ్యవస్థ, లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు, పారదర్శకత, సమయపాలన, ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలకు ప్రశంసలు లభించాయి. దేశంలోని పది రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక కీలక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ పనితీరు కనబరచింది. ఈ అధ్యయనంలో దేశవ్యాప్తంగా అధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేశారు. మొత్తం 6 వేల మంది లబ్ధిదారులు, 600 గ్రామ పంచాయతీలు, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫోకస్‌ గ్రూప్‌ చర్చల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దేశవ్యాప్తంగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌(డీబీటీ) విధానం అమలవుతున్నప్పటికీ, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు.. బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ విజయవంతంగా అమలు చేస్తోందని ఈ అధ్యయనం ప్రత్యేకంగా ప్రశసించింది. పింఛన్లు ప్రతినెలా సమయానికి క్రమం తప్పకుండా అందుతున్నాయని, దీంతో లబ్ధిదారుల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం సామాజిక భద్రతకు కొత్త ప్రమాణాలను సృష్టించిందని పేర్కొంది.


అధిక పింఛన్లు... అధిక సంతృప్తి

కేంద్ర పింఛన్లకు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 75.1 శాతం మంది లబ్ధిదారులు పింఛన్‌ వల్ల కుటుంబంపై ఆధారపడటం తగ్గిందని చెప్పగా, ఆంధ్రప్రదేశ్‌ వంటి అధిక పింఛన్‌ రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. 81-84 శాతం మంది పింఛను మొత్తాన్ని ఆహారం, మందుల కొనుగోలుకు వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఏపీ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఏపీ అత్యుత్తమ పనితీరు కనబరచిందని తెలిపింది. గ్రామస్థాయి వ్యవస్థ, స్థానిక సంస్థలు, డిజిటల్‌ ప్రచార కార్యక్రమాల ద్వారా పథకాల సమాచారం లబ్ధిదారులకు చేరుతోందని పేర్కొంది. బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అవగాహన ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది.


సోషల్‌ ఆడిట్‌లో అగ్రగామి

దేశంలో సామాజిక తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అధ్యయనంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ, వార్డు అధికారుల్లో 76.7 శాతం మంది తమ ప్రాంతాల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఇది పారదర్శకత పాలనకు నిదర్శనమని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సోషల్‌ ఆడిట్లు సక్రమంగా జరగని రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పర్యవేక్షణ వ్యవస్థ బలంగా ఉందని నివేదిక విశ్లేషించింది. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని అధ్యయనం తెలిపింది. రాష్ట్రంలోని 90 శాతం పంచాయతీలు, వార్డు గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ వ్యవస్థలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఫిర్యాదుల పరిష్కారానికి గ్రామసభలు ప్రధాన వేదికగా మారాయని, పెన్షన్‌ ఆలస్యాలపై వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఏపీ మోడల్‌ను అమలు చేయాలి

వృద్ధులు, దివ్యాంగులు ప్రయాణించలేని పరిస్థితుల్లో ఇంటి వద్దకే పింఛన్లు అందించే విధానాన్ని హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఈ విధానాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా 73 శాతం మంది లబ్ధిదారులు పింఛన్‌ ఎంపిక, మంజూరు, పంపిణీ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ సంతృప్తి స్థాయి మరింత ఎక్కువగా నమోదైంది. జీవన నాణ్యత మెరుగుపడటంలో రాష్ట్ర ప్రభుత్వ అదనపు పింఛన్ల పాత్ర కీలకమని అధ్యయనం స్పష్టం చేసింది. గ్రామస్థాయిలో సేవా కేంద్రాలు, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం, సామాజిక తనిఖీలు, డేటా ఆధారిత పర్యవేక్షణ వంటి అంశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తున్న విధానాన్ని సామాజిక భద్రతా రంగంలో ఉత్తమ నమూనాగా గుర్తించింది. దేశంలో ఉత్తమ పంపిణీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు లభించింది.

Updated Date - Aug 10 , 2026 | 03:37 AM