Share News

లబ్ధిదారుల వాదన వినకుండా పెన్షన్లు రద్దు చేస్తారా?

ABN , Publish Date - May 23 , 2026 | 05:17 AM

లబ్ధిదారుల వాదన వినకుండా అధికారులు పెన్షన్లు రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ చర్య సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.

లబ్ధిదారుల వాదన వినకుండా పెన్షన్లు రద్దు చేస్తారా?

  • ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం

  • పెన్షన్‌ దాతృత్వంతో ఇచ్చేది కాదు: హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారుల వాదన వినకుండా అధికారులు పెన్షన్లు రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ చర్య సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పేద బలహీనవర్గాలకు ఆర్థిక సహాయం అందించడం పెన్షన్‌ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపింది. లబ్ధిదారుల అర్హతను తనిఖీ చేసే అధికారం అధికారులకు ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలని తేల్చిచెప్పింది. ఒకసారి పింఛను మంజూరు చేసిన తర్వాత లబ్ధిదారులు పథకానికి అర్హులు కాదని భావిస్తే విచారణ పారదర్శకంగా నిర్వహించాలని, పెన్షన్‌ రద్దుకు అధికారులు సరైన కారణాలు పేర్కొనాలని తెలిపింది. ఏకపక్షంగా రద్దు చేస్తే పథకం ఉద్దేశం దెబ్బతింటుందని పేర్కొంది. అవసరం ఉన్నవారి కోసం పింఛను సొమ్మును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతోందని గుర్తుచేసింది. శ్రీకాకుళం జిల్లా మసఖాపురం గ్రామానికి చెందిన ఐదుగురి పెన్షన్లను రద్దుచేస్తూ ఎంపీడీవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిం ది. తక్షణమే పిటిషనర్ల పెన్షన్లు పునరుద్ధరించాలని, బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ, ఇచ్ఛాపురం ఎంపీడీవోను ఆదేశించింది. మరోవైపు పిటిషనర్ల అర్హతను తేల్చేందుకు తాజాగా విచారణ జరిపే విషయంలో ప్రస్తుత తీర్పు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చా రు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం మసఖాపురం గ్రామానికి చెందిన దల్లి రామకృష్ణ(దివ్యాంగుడు), బి.కుర్రమ్మ, కె.మోహిని(వితంతువులు), ఎ.దాలమ్మ, ఎ.లోలాక్షి (ఒంటరి మహిళలు) పెన్షన్లు పొందుతున్నారు. అయితే, ఎమ్మెల్యే లే ఖ ఆధారంగా అధికారులు 2024 నవంబరు నుంచి తమ పింఛన్లు నిలిపివేశారని, వాటిని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ ఈ ఐదుగురూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల వివరణ కోరుతూ ఎంపీడీవో 2024 ఆగస్టులో ఫిర్యాదు అందకముందే నోటీసులు ఇచ్చారని తెలిపారు. గ్రామ సర్పంచ్‌ నిరక్షరాస్యురాలని, ఆమె సంతకం చేయలేరని తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 05:18 AM