ధాన్యం డబ్బు జమలో చరిత్ర సృష్టించాం
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:16 AM
రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతులు పండించిన ధాన్యానికి న్యాయమైన ధర ఇస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
24 గంటల్లోనే రైతుల ఖాతాలో వేశాం
ఈ సీజన్‌లో 42 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం
రైతులకు 10,850 కోట్లు చెల్లించాం
మంత్రి నాదెండ్ల మనోహర్
తిరుపతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతులు పండించిన ధాన్యానికి న్యాయమైన ధర ఇస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోలుపై తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల అధికారులతో శనివారం ప్రాంతీయస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్‌లో 7.52 లక్షల మంది రైతుల నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 10,850 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బు జమ చేసి చరిత్ర సృష్టించామన్నారు. 51 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకుని 47 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతుల నుంచి ప్రతి గింజ, ప్రతి బస్తా కొనుగోలు చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.