పంచాయతీరాజ్‌లో ‘ఆంధ్రా’ మార్క్
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:52 AM
కీలక సంస్కరణలతో పాటు పలు రకాల పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో కేంద్ర అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్....
కూటమి ప్రభుత్వం వచ్చాక 10 రకాల సంస్కరణలకు శ్రీకారం
జాతీయ స్థాయిలో పంచాయతీలకు ఐదు అవార్డులు
నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కీలక సంస్కరణలతో పాటు పలు రకాల పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో కేంద్ర అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను లెక్కచేసేవారు కాదు. నిధులు విడుదల చేసేవారు కాదు. అయితే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ శాఖ పగ్గాలు చేపట్టాక.. సమర్థులైన అధికారులు, సిబ్బందితో సత్ఫలితాలు సాధిస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబడుతున్నారు. సుమారు పది అంశాల్లో ఈ శాఖ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. 2025- 26 సంవత్సరానికి సంబంధించి రెండు కేటగిరీల కింద రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. స్థానికంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేస్తున్న 5 పంచాయతీలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్(డీడీయూపీఎస్‌వీపీ), నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతాత్ వికాస్ పురస్కార్(ఎన్‌డీఎస్‌పీఎస్‌వీపీ)లను కేంద్రం ప్రకటించింది. మహిళా స్నేహపూర్వక పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి మొదటి ర్యాంకు.. పేదరిక నిర్మూలన-జీవనోపాధి పెంపు కేటగిరీలో కడప జిల్లా ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి రెండో ర్యాంకు.. మౌలిక వసతుల స్వీయ అభివృద్ధి కేటగిరీ కింద ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమల గ్రామ పంచాయతీకి మూడో ర్యాంకు.. అదే విధంగా మండల స్థాయిలో చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి అవార్డు దక్కింది. ఈ పంచాయతీలకు రూ.4.75 కోట్ల నగదు బహుమతి కూడా అందించనున్నట్లు కేంద్రం సమాచారం అందించింది.
ఒకేరోజు గ్రామసభలు..
కూటమి అధికారంలోకి రాగానే పవన్ కల్యాణ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 13,265 పంచాయతీల్లో ఒకే రోజు (2024 ఆగస్టు 23న) గ్రామసభలు నిర్వహించడం ద్వారా పంచాయతీరాజ్ శాఖ చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమం ‘వరల్డ్ రికార్డ్ యూనియన్’లో స్థానం దక్కించుకుంది. పంచాయతీలకు గతంలో స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహించుకోవాలంటే ఆదాయాన్ని బట్టి రూ.100 మాత్రమే వ్యయం చేసుకునే అవకాశముంటే.. ఉపముఖ్యమంత్రి ఆ వ్యయాన్ని రూ.10 వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. కూటమి అధికారంలోకి వచ్చే వరకు పంచాయతీల్లో పన్నుల వ్యవస్థ అడ్డగోలుగా ఉండేది. పన్నుల వసూలు కూడా పారదర్శకంగా ఉండేది కాదు. వసూలు చేసిన మొత్తం పంచాయతీల ఖాతాల్లో జమయ్యేవి కావు. కొన్నిచోట్ల బోగస్ బిల్లు బుక్‌లు ప్రింట్ చేసి స్వాహా చేసేవారు. దీంతో పంచాయతీల ఆదాయం పడిపోయింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌కు రూపకల్పన చేశారు. ఫలితంగా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లిస్తే వెంటనే బిల్లు మొబైల్‌కు వచ్చేస్తోంది. 96 లక్షల అసె్‌సమెంట్లతో పంచాయతీల ఆదాయం రూ.1,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎస్‌ఏ ) అమలును గత ప్రభుత్వం అటకెక్కించింది. ఒక్క ప్రజాప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో అప్పట్లో రాష్ట్రానికి కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. నాడు ఆర్‌జీఎ్‌సఏ అమల్లో ఆంధ్ర 24వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ శాఖ అధికారుల నిరంతర కృషితో మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం.
10 వేల పదోన్నతులు..
చిన్నపాటి అభియోగాలు ఉండడం, ఏళ్ల తరబడి డీసీపీ నిర్వహించకపోవడం, ఎంపీడీవోలకు గతంలో ప్రమోషన్ చానల్ లేకపోవడంతో పదోన్నతులు లేక కునారిల్లుతున్న పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ఒకే సారి 10 వేల మందికి పైగా పదోన్నతులను కూటమి ప్రభుత్వం కల్పించింది. డీపీవో వ్యవస్థ, జడ్పీ, గ్రామ పంచాయతీలు.. ఇలా మూడు రకాలుగా ఉన్న వ్యవస్థలను ఏకం చేయడం ద్వారా పాలనను కూడా సులువు చేసింది. గ్రామీణుల ఇళ్లలో పనికిరాని వేస్ట్‌ను సంపదగా మార్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ‘స్వచ్ఛరథం’ పేరుతో చేపట్టిన వినూత్న ప్రాజెక్టు సూపర్‌హిట్ అయింది. 434 స్వచ్ఛ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. జిల్లాల్లో పాలనను బలోపేతం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే పంచాయతీరాజ్ వ్యవస్థలకు కూటమి ప్రభుత్వం పదునుపెట్టింది. పూర్వ బ్లాక్ డెవల్‌పమెంట్ అధికారులు తరహాలో ఇప్పుడు డివిజన్ స్థాయిలో డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకొచ్చింది. అటు కలెక్టర్‌కు జవాబుదారీగా ఉన్న డీడీవోలు డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు రథసారథులుగా నిలుస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించారు. అయితే ఆయా క్లస్టర్లు రూపకల్పన నిర్దిష్ట విధానంలో జరగలేదు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. జనాభా, ఆదాయాన్ని బట్టి పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించింది. మేజర్ పంచాయతీలు, మండల కేంద్రంగా ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా రూపొందించింది. వాటికి డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారులను నియమించి పాలనను గాడిలో పెట్టింది.
పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ..
వైసీపీ హయాంలో నిధుల్లేక నీరసించిన పంచాయతీలకు కూటమి సర్కారు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చింది. ఖాతాల్లో డబ్బులు పడుతుండడంతో అవసరమైన పనులను స్వేచ్ఛగా చేపడుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వాటికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన కేంద్ర నిధులు అందుతున్నాయి. పవన్ కల్యాణ్ చొరవతో తాగునీటి, పారిశుధ్య వసతులు, రోడ్ల నిర్మాణాలతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి జీపీడీపీ మార్గదర్శకాల ప్రకారం పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌లో అమలవుతున్న పలు పథకాలను రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు కమిషనరేట్‌లో ప్రత్యేక బృందం పనిచేస్తోంది. యువ ఎంపీడీవోలను అందులో నియమించారు. ఈ బృందం పథకాల అమలును డేగకన్నుతో గమనిస్తోంది. ఎక్కడైనా అధికారులు లేదా సిబ్బంది అవినీతి, అవకతవకలకు పాల్పడుతుంటే.. నిమిషాల్లో తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.