Share News

రోజుకు 5 గంటలే పని చేయాలి

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:33 AM

ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేందుకు ఉన్నత విద్యా శాఖ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. విద్యార్థులపై వత్తిడి, ఆత్మహత్యల నివారణకు కోచింగ్‌ సంస్థలకు నూతన రూల్స్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం విడుదల చేశారు.

రోజుకు 5 గంటలే పని చేయాలి

  • ఆదివారాలు కోచింగ్‌ సెంటర్లు తెరవొద్దు

  • నిబంధనల ఉల్లంఘనకు భారీ జరిమానాలు

  • కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్‌

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేందుకు ఉన్నత విద్యా శాఖ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. విద్యార్థులపై వత్తిడి, ఆత్మహత్యల నివారణకు కోచింగ్‌ సంస్థలకు నూతన రూల్స్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం కోచింగ్‌ సంస్థ గరిష్ఠంగా రోజుకు ఐదు గంటలే పనిచేయాలి. ఆదివారం తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ప్రభుత్వం గుర్తించిన సెలవుల్లో కోచింగ్‌ సంస్థలు తెరవకూడదు. పరీక్షల నిర్వహణలో సరైన వ్యవధి ఇవ్వాలి. ప్రతి సంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యార్థులను లైంగిక, వివక్షపూరిత, ఇతర రూపాల్లో వేధింపులకు గురిచేస్తే చర్యలు చేపట్టాలి. ఫీజులు చెల్లించలేదని వేధింపులకు పాల్పడకూడదు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నేతృతత్వంలో ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. ఇందులో ఎస్పీ, డీఈవో, ఇంటర్‌ విద్య, ఇతర అధికారులు ఉంటారు. ఈ కమిటీ బయటి నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తుంది. అంతర్గత కమిటీతో సంబంధం లేకుండా నేరుగా కూడా ఫిర్యాదులు తీసుకోవచ్చు. మీడియా కథనాలు, పోలీసుల రిపోర్టులు, ఇతర సమాచారం ఆధారంగా కమిటీ సుమోటోగా కూడా విచారణ చేసే అధికారం ఉంటుంది. ప్రతి కోచింగ్‌ సంస్థ కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకోవాలి. సంస్థ భవనానికీ నిబంధనలు పాటించాలి. తాత్కాలిక ప్రాతిపదికన సంస్థలు నడపకూడదు. ఆత్మహత్యలకు వీల్లేకుండా స్ర్పింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. బాల్కనీలు, టెర్ర్‌సపైకి విద్యార్థులు వెళ్లకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలి. సరిపడ మరుగుదొడ్లు, రూమ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రతి సంస్థ కచ్చితంగా వెబ్‌సైట్‌ రూపొందించుకోవాలి. అందులో ఫ్యాకల్టీ, భవనం వివరాలు, ఫీజుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. పాఠశాలలు, కాలేజీల తరగతుల సమయంలో కోచింగ్‌ సంస్థలు నిర్వహించకూడదు.


ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, రెగ్యులర్‌ లెక్చరర్లు కోచింగ్‌ సంస్థలో పనిచేయకూడదు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతి సంస్థ రికార్డులు నిర్వహించాలి. ప్రతి సంస్థలో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. నెలవారీ వెల్‌నెస్‌ రిపోర్టులు తయారుచేసి, జిల్లా కమిటీలకు సమర్పించాలి. సైకాలజిస్ట్‌ల కోసం స్థానిక ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోవాలి. తరచూ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో విద్యార్థి కోర్సు మానేస్తానంటే మిగిలిన కాలానికి ఫీజు తిరిగివ్వాలి. విద్యార్థుల ఒరిజినల్‌ అకడమిక్‌ సర్టిఫికెట్లు తీసుకోవడం నిషేధం. జిల్లాస్థాయి కమిటీకి ఎప్పుడైనా ఏ కోచింగ్‌ సంస్థనైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. మౌలిక సదుపాయాలు, భద్రత ప్రమాణాలు, మానసిక ఆరోగ్యం నిర్వహణలో లోపాలుంటే పరిశీలించి, సరిదిద్దుకునేందుకు 15రోజుల గడువు ఇస్తుంది. అప్పటికీ మారకపోతే మొదటి ఉల్లంఘనలకు రూ.50 వేలు, రెండోసారి ఉల్లంఘనకు రూ.లక్ష జరిమానా విధిస్తుంది. తర్వాత మళ్లీ ఉల్లంఘనకు పాల్పడితే రిజిస్ర్టేషన్‌ రద్దవుతుంది. విద్యార్థి ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు కూడా రిజిస్ర్టేషన్‌ను రద్దుచేసే అవకాశం ఉంటుంది.

Updated Date - Mar 28 , 2026 | 05:35 AM