కోచింగ్ సెంటర్‌లో కౌన్సెలర్ తప్పనిసరి !
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:16 AM
కోచింగ్ సెంటర్ల నిర్వహణ అంశంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం...
‘పోటీ’ చదువులో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సలహాలు ఇవ్వాలి
ఇన్‌స్టిట్యూట్‌కు ప్రతి ఆదివారం సెలవు
రోజుకు గరిష్ఠంగా ఐదు గంటలే తరగతులు
పాఠశాలలు, కాలేజీలు నడిచే సమయాల్లో కోచింగ్ సెంటర్లలో క్లాసులు జరగొద్దు
రెండు రోజుల్లో కొత్త రూల్స్ విడుదల
ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కోచింగ్ సెంటర్ల నిర్వహణ అంశంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం... ‘కోచింగ్ సంస్థల రెగ్యులేషన్ అండ్ కంట్రోల్’ పేరుతో ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. వాటిపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన ప్రభుత్వం.. తుది రూల్స్ విడుదలకు సిద్ధమైంది. ఈ అంశం ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలనలో ఉండగా, రెండు రోజుల్లో జీవో విడుదలకు ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సలహాలు ఇచ్చేందుకు ప్రతి కోచింగ్ సెంటర్‌లో మానసిక ఆరోగ్య సలహాదారు (సైకలాజికల్ కౌన్సెలర్)ను నియమించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇంకా కోచింగ్ సెంటర్ల నమోదు, పనివేళలు, సెలవు దినాలు తదితర అంశాలపై కీలకమైన రూల్స్ తీసుకురానున్నారు. ఉన్నత విద్యలో అడ్మిషన్ల కోసం ఈఏపీసెట్, నీట్, జేఈఈ వంటి పోటీ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం ప్రతి కోచింగ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ వద్ద కచ్చితంగా నమోదు చేయించాలి. సాధారణంగా పాఠశాలలు, కాలేజీలు నడిచే సమయాల్లో ఈ సెంటర్లు పనిచేయకూడదు. పాఠశాలలు, కాలేజీల్లో చేరిన విద్యార్థులు సాధారణ తరగతుల సమయంలో కోచింగ్ సెంటర్లకు వెళ్లకూడదు. రోజుకు గరిష్ఠంగా 5 గంటలు మాత్రమే సెంటర్‌ను నడపాలి. ప్రతి ఆదివారం కచ్చితంగా సెలవు ఇవ్వాలి. ఏ కోచింగ్ సెంటరూ ర్యాంకులు, మార్కులు, పేర్లను బహిరంగంగా ప్రదర్శించకూడదు.
మరికొన్ని కీలక నిబంధనలు..
ఆత్మహత్యలకు సాధ్యం కాని స్ర్పింగ్ లోడెడ్ సీలింగ్ ఫాన్లను మాత్రమే కోచింగ్ సెంటర్లలో బిగించాలి.
విద్యార్థులు టెర్ర్‌సలు, బాల్కనీల్లోకి వెళ్లకుండా నిషేధించాలి.
కామన్ ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.
24 గంటల పాటు వార్డెన్లు, సెక్యూరిటీ గార్డులను నియమించాలి.
ఫిర్యాదులకు కమిటీని నియమించాలి.