మున్సిపోల్స్‌కు సై
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:38 AM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, 106 మున్సిపాలిటీల చైర్‌పర్సన్లకు రిజర్వేషన్లు కేటాయిస్తూ సోమవారం జీవో, నోటిఫికేషన్ జారీ చేసింది.
రిజర్వేషన్లు ఖరారు
106 పురపాలికలు, 17 కార్పొరేషన్లకు ప్రకటన
బీసీలకు 36 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు
ఎస్టీకి మంగళగిరి-తాడేపల్లి, ఎస్సీలకు కర్నూలు, రాజమండ్రి
నెల్లూరు, విజయవాడ అన్‌రిజర్వ్‌డ్.. తిరుపతి, ఒంగోలు కూడా..
మొత్తంగా మహిళలకు 50 శాతం కేటాయింపు
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, 106 మున్సిపాలిటీల చైర్‌పర్సన్లకు రిజర్వేషన్లు కేటాయిస్తూ సోమవారం జీవో, నోటిఫికేషన్ జారీ చేసింది. 17 కార్పొరేషన్లలో 8 మహిళలకు కేటాయించగా.. 106 మున్సిపాలిటీల్లో 53.. అంటే సగం వారికే రిజర్వు అయ్యాయి. అలాగే కార్పొరేషన్లలో ఐదు బీసీలకు దక్కాయి. మున్సిపాలిటీల్లో 36 వారికి కేటాయించారు. కార్పొరేషన్లలో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు, జనరల్ మహిళలకు 5 స్థానాలు, జనరల్ (అన్‌రిజర్వ్‌డ్)కు 4 స్థానాలు దక్కాయి. రాష్ట్రంలో అత్యంత కీలకమైన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌ను జనరల్ మహిళకు కేటాయించారు. నెల్లూరు, విజయవాడ, తిరుపతి, విజయవాడ, ఒంగోలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఇక 106 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు మూడు రిజర్వు కాగా.. వాటిలో ఒకటి మహిళకు కేటాయించారు.
ఎస్సీలకు 14 రిజర్వ్ చేయగా.. వాటిలో ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలకు చెరో ఏడు స్థానాలు దక్కాయి. 36 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు బీసీలకు కేటాయించారు. ఇందులో 18 బీసీ జనరల్, మరో 18 స్థానాలు బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 53 స్థానాల్లో 27 జనరల్ మహిళలకు, 26 జనరల్(అన్‌రిజర్వ్‌డ్)గా ఖరారయ్యాయి. 17 కార్పొరేషన్ల రిజర్వేషన్ల జీవోను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ విడుదల చేయగా.. అనంతరం 106 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్‌ను మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్ విడుదల చేశారు. ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు ఆయా కేటగిరీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్కులో వివక్ష
ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు