ఎంఎస్ఎంఈల బలోపేతానికి కృషి
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:18 AM
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండేళ్లలో పలు వినూత్న సంస్కరణలు, ప్రోత్సాహకాలు..
ప్రతి కుటుంబానికీ ఆదాయం, ప్రతి యువకుడికీ ఉపాధి
స్పౌజ్ కేటగిరీ కింద త్వరలో 2.6 లక్షల కొత్త పెన్షన్లు: కొండపల్లి
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండేళ్లలో పలు వినూత్న సంస్కరణలు, ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయక కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ శాఖల రెండేళ్ల అభివృద్ధిపై విలేకరుల సమావేశంలో వివరించారు. ఎంఎస్ఎంఈల ద్వారా పారిశ్రామికాభివృద్ధి, సెర్ప్ ద్వారా మహిళా సాధికారత, ఏపీఎన్‌ఆర్‌టీఎ్‌స ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం అనే మూడు శక్తివంతమైన అంశాలపై అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబానికీ ఆదాయం, ప్రతి యువకుడికీ ఉపాధి, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన, ప్రతి ప్రవాసాంధ్రుడికీ భరోసా అనే దార్శనిక లక్ష్యాన్ని సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 55 వేల సూక్ష్మ, 8 వేలు చిన్న, వెయ్యికి పైగా మధ్యతరహా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో సేవారంగం 49 శాతం, వాణిజ్యరంగం 28 శాతం, తయారీ రంగం 23 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 792 పరిశ్రమలకు భూకేటాయింపులు, 1,03,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు పునరుద్దరణకు ప్రత్యేక ఎంఎస్ఎంఈ రివైవల్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు.
గత రెండేళ్లలో రూ.1.90 లక్షల కోట్లకు పైగా బ్యాంకు రుణాలను మంజూరుచేసినట్లు పేర్కొన్నారు. చీఫ్‌మినిస్టర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్‌మెంట్ ప్రోగ్రాం(సీఎంఏపీ) కింద రూ.300 కోట్లతో కార్యక్రమాన్ని అమలుచేస్తూ యువతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా వేలాది కొత్త వ్యాపారాలు, 17,600కు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు. గత ఏడాది లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 62.34 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక భద్రత పెన్షన్లు అందచేస్తూ, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. స్పౌజ్ కేటగిరీ కింద రెండు నెలల్లో 2.6 లక్షల కొత్త పెన్షన్లు మంజూరుచేసేందుకు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రవాసాంధ్రులకు అండగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, సాధికారత కోసం ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా సమగ్ర సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో 1,376 ఫిర్యాదులను పరిష్కరించగా, డీజీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ ద్వారా అందిన మరో 398 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న 104 మంది ప్రవాసాంధ్రులను రక్షించి స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. 8,258 మంది ప్రవాసాంధ్రులకు తిరుమలతో పాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించామన్నారు.