నేడు పరిషత్ రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:43 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. మంగళవారం సాయంత్రానికల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఆదేశించింది.
రేపు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఫైనల్!
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. మంగళవారం సాయంత్రానికల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఆదేశించింది. అదేవిధంగా బుధవారం సాయంత్రానికల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయాలని సూచించింది. కమిషనర్ స్థాయిలో నిర్ధారించాల్సిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను కూడా మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయనున్నారు. ఈ నెల 14న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత 19న పరిషత్, అనంతరం సర్పంచ్‌ల ఎన్నికలను రెండు విడతల్లో చేపట్టేందుకు వరుసగా నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారమంతా పంచాయతీరాజ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు రిజర్వేషన్ల కేటాయింపులపై అవగాహన కల్పించారు. సోమవారం ఉదయం కూడా అన్నీ జిల్లాల జెడ్పీ సీఈఓలు, డీపీఓలను తాడేపల్లి కమిషనరేట్ కార్యాలయం వద్దకు పిలిచి మరింత అవగాహన కల్పించారు. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు.
గత రిజర్వేషన్ల విధానంలో తప్పులు
రిజర్వేషన్ల నిర్ధారణకు గత ప్రభుత్వం నిర్వహించిన విధానం తప్పుగా ఉందని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ సిబ్బంది పాత విధానం అనుసరించి ఇదివరకే నివేదికలు తయారు చేశారు. అయితే సోమవారం పంచాయతీరాజ్ అధికారులు అలెర్ట్ చేయడంతో కొత్త రిజర్వేషన్ లెక్కించే విధానం అనుసరించారు. గతంలో ఎంపీటీసీ రిజర్వేషన్ ఫైనల్ చేసేటప్పుడు, ర్యాంకింగ్‌లో ఎస్టీ రిజర్వేషన్లు లెక్కించేటప్పుడు ఆయా ఎంపీటీసీ స్థానంలోని ఎస్టీ జనాభాను మొత్తం మండల ఎస్టీ జనాభాతో డివైడ్ చేసి దానిని శాతంగా చూపేవారు. ఇప్పుడు ఎంపీటీసీ స్థానం జనాభాను ఆ స్థానంలోని అన్నీ కులాల జనాభా మొత్తంతో డివైడ్ చేసి దానిని శాతంగా చూపించారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ జనాభాకు సంబంధించి అవరోహణ ర్యాంకింగ్ రూపొందించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్కులో వివక్ష
ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు