Share News

జయమంగళ రాజీనామా తిరస్కరణ అప్రజాస్వామికం

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:15 AM

ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామాను మండలి చైర్మన్‌ తిరస్కరించడాన్ని పలువురు ఎమ్మెల్సీలు తప్పు పట్టారు. చైర్మన్‌ చర్య అప్రజాస్వామికమని విమర్శించారు.

జయమంగళ రాజీనామా తిరస్కరణ అప్రజాస్వామికం

  • కోర్టు జరిమానా విధించినా చైర్మన్‌ తీరు మారలేదు

  • మోషేన్‌ రాజు తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీలు వేపాడ, ఆలపాటి, మర్రి

అమరావతి, తెనాలి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామాను మండలి చైర్మన్‌ తిరస్కరించడాన్ని పలువురు ఎమ్మెల్సీలు తప్పు పట్టారు. చైర్మన్‌ చర్య అప్రజాస్వామికమని విమర్శించారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెనాలలో, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ చిలకలూరిపేటలో మాట్లాడారు. ‘చైర్మన్‌ తీరు ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉంది. ప్రజా ప్రతినిధులందరికీ స్వచ్ఛందంగా రాజీనామా చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. జయమంగళ రాజీనామా తిరస్కరణ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. సభ్యులు లిఖితపూర్వకంగా మాత్రమే కాదు, సభలో నిలబడి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. గతంలో ఎప్పుడూ మండలి చైర్మన్‌కు కోర్టు జరిమానా విధించిన దాఖలాల్లేవు. 2025 సెప్టెంబరులో ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారంలో చైర్మన్‌కు కోర్టు రూ.10వేలు జరిమానా విధించినా ఆయన తీరు మారలేదు’ అని చిరంజీవి విమర్శించారు. ఆలపాటి మాట్లాడుతూ, ‘మండలి చైర్మన్‌ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ ప్రస్తుత చైర్మన్‌ వ్యవహార శైలి పెద్దల సభ గౌరవాన్ని మంట కలిపేలా ఉంది. సభా గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి ఆ గౌరవాన్ని కోర్టు మెట్లు ఎక్కించడం ఎంతవరకు సమంజసమో చైర్మన్‌ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ, ‘వైసీపీ ఒత్తిళ్లకు తలొగ్గి చైర్మన్‌ రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరిస్తూ చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. సభ్యుల హక్కులను ఆయన కాలరాస్తున్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇచ్చిన పిటీషన్‌ ఆధారంగా రాజీనామాను తిరస్కరించడం విడ్డూరంగా ఉంది. మా రాజీనామాలపై కూడా చాలాకాలంగా చైర్మన్‌ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఇప్పటికే కోర్టులో పోరాటం జరుగుతోంది’ అని అన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 05:16 AM