ఎమ్మెల్యే గారూ.. ఎలా ఉన్నారు!?
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:33 AM
రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరేది అమరావతిలో! కానీ... సామాన్య ప్రజలకు కనిపించే ‘సర్కారు’ మాత్రం స్థానిక ఎమ్మెల్యేనే! ఏ సమస్య వచ్చినా కలిసేది ఎమ్మెల్యేనే! ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధి...
సభలో అడుగు పెట్టి రెండేళ్లు.. జనం మెచ్చేలా అత్యధికుల పనితీరు.. నొచ్చుకునేలా కొందరి వైఖరులు
పలు నియోజకవర్గాల్లో ‘వైసీపీ’ తరహా దందాలు
మద్యం, రేషన్, ఇసుక, మట్టి మాఫియాలు
వైసీపీ నేతలతోనే చేతులు కలిపిన వైనం
షాడోల నీడలో పలు నియోజకవర్గాలు
కుటుంబ సభ్యులు, అనుచరులదే హవా
నియంత్రించలేని స్థితిలో అధినేతలు
అన్నిచోట్లా జోరుగా అభివృద్ధి పనులు
కొన్నిచోట్ల ఎమ్మెల్యేల తీరుతోనే మైనస్
ఇప్పటికైనా మారితేనే వారికీ, సర్కారుకూ మేలు
తొలి ఏడాది తప్పులను దిద్దుకున్న పలువురు
‘...అను నేను’ అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి రెండేళ్లు! ఆ పదకొండు మినహాయిస్తే... 164 నియోజకవర్గాల్లో అధికార కూటమి శాసన సభ్యులే! మరోరకంగా చెప్పాలంటే దాదాపు రాష్ట్రమంతా ‘అధికార పార్టీ’ ఎమ్మెల్యేలే! ఎమ్మెల్యేలు... చట్టసభకు ప్రాతినిధ్యం వహించే వారు. చట్టాల రూపకల్పనలో భాగస్వాములు కావాల్సిన వారు! కానీ... ‘నియోజకవర్గానికి మేమే రాజులం’ అంటూ అధికారం చలాయించడం ఎప్పుడో మొదలైంది. వైసీపీ హయాంలో అది మరింత శ్రుతిమించింది! అధికారం... అరాచకం స్థాయికి చేరింది. మరి... కూటమి సర్కారులో పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? ప్రజల మనసులు చూరగొని మళ్లీ గెలవాలనుకుంటున్నారా? లేక... ‘వన్ టైమ్ ఎమ్మెల్యేలు’గా మిగిలిపోయినా చాల్లే అనుకుంటున్నారా? శాసనసభ్యులుగా ప్రమాణం చేసి రెండేళ్లు నిండిన సందర్భంగా వారి తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరేది అమరావతిలో! కానీ... సామాన్య ప్రజలకు కనిపించే ‘సర్కారు’ మాత్రం స్థానిక ఎమ్మెల్యేనే! ఏ సమస్య వచ్చినా కలిసేది ఎమ్మెల్యేనే! ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధి... శాసనసభ్యుడు! ప్రభుత్వం మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలంటే... ఈ ‘వారధి’ ప్రజలకు దగ్గరగా ఉండాలి! కూటమి ప్రభుత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో పాస్ మార్కులు తెచ్చుకున్నారు. కానీ... కొందరు మాత్రం చేస్తున్న మంచి మరుగున పడే స్థాయిలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. రెండేళ్లు ఎలాగూ గడిచిపోయాయి. మిగిలిన మూడేళ్లలోనైనా పద్ధతి మార్చుకోకుంటే ఇలాంటి ఎమ్మెల్యేలకు కష్టం తప్పదనే హెచ్చరికలు క్షేత్రస్థాయి నుంచి వెలువడుతున్నాయి.
అదే బాటలో...
‘వై నాట్ 175’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ ధీమా వ్యక్తం చేసినా... ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా ఓడిపోవడానికి జగన్ నిరంకుశత్వంతోపాటు అనేక కారణాలున్నాయి! అందులో ముఖ్యమైనది... నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అరాచకాలు! దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన ప్రస్తుత ఎమ్మెల్యేలలో కొందరు విచిత్రంగా వైసీపీనే ఆదర్శంగా తీసుకుంటున్నారు. ‘మీ స్థాయిలో మేం చేయలేం. మీరు చేసి పెట్టండి. మేం సహకరిస్తాం’ అంటూ వైసీపీ నేతలతోనూ చేతులు కలిపారు. సుమారు 30 నియోజకవర్గాల్లో ఇసుక, గ్రావెల్, గ్రానైట్ దందాలు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. వీరికి కూటమి ఎమ్మెల్యేలు సహకరిస్తూ... వాటాలు పంచుకుంటున్నారు. ఇది కేడర్‌తోపాటు ప్రజల్లోనూ అసంతృప్తి, ఆగ్రహానికి కారణమవుతోంది.
మీరేం మహారాజులా??
‘నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దు’ ఇది ప్రభుత్వ ఆదేశం! కానీ... కొందరు ఎమ్మెల్యేలు తలచుకుంటే ఏ భూములూ రిజిస్టర్ కావు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఈ ‘హుకుం’ అమలవుతోంది. భారీ విస్తీర్ణంలో ఉన్న భూములు రిజిస్టర్ చేసే ముందు ‘ఒకసారి ఎమ్మెల్యేగారిని కలవండి’ అని సబ్ రిజిస్ట్రార్లు నేరుగా చెప్పేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల లేఔట్లకు అనుమతి ఇవ్వాలన్నా ఎమ్మెల్యే సార్ అనుమతి కావాల్సిందే. ఇక... నియోజకవర్గ స్థాయిలో జరిగే రహదారులు, డ్రైనేజీలు, ఇతరత్రా చిన్న చిన్న కాంట్రాక్టుల టెండర్లూ ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే ‘ఓకే’ అవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే నియోజకవర్గాలకు ‘మేమే మహారాజులం’ అనే స్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు సమాంతర ప్రభుత్వాన్ని, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాన్ని మించి అధికారాన్ని చలాయిస్తున్నారు. ఇక... పోస్టింగులు, బదిలీల్లోనూ పైసా వసూల్! చాలా నియోజకవర్గాల్లో వైసీపీ హయాంలో సాగినట్లే నేటికీ రేషన్ మాఫియా నడుస్తోంది. పోలీసు స్టేషన్లలో పంచాయితీలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపుల నుంచి వసూళ్లూ సాగిస్తున్నారు. వేసవిలో చెరువుల్లో మట్టిని ట్రాక్టర్లలో, బండ్లలో తీసుకెళ్లి పొలాల్లో వేసుకోవడం సహజం. కొన్ని నియోజకవర్గాల్లో మరీ దారుణంగా ఈ మట్టి తరలింపులనూ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ‘మాకేంటి’ అని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వానికే చేటు తెచ్చేలా తయారైంది.
షాడోలు... సూడోలు
కొందరు ఎమ్మెల్యేలు ఎంతో మంచి వారు! పాపం... సొంతంగా దందాలు చేయలేరు! అందుకే, వారి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, లేదా ముఖ్య అనుచరులు రంగంలోకి దిగుతారు. ఆ నియోజకవర్గానికి వారే షాడో ఎమ్మెల్యేలు! ఏదైనా పని కోసం వెళితే... ‘ఫలానా వాళ్లను కలువు’ అని నేరుగా చెప్పే ఎమ్మెల్యేలూ ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఎమ్మెల్యేను మించి ‘షాడో’ ల దందాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి మార్చుకోకపోతే... రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నట్లే.
గ్రూపుల గోల...
పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు గట్టిగానే ఉన్నాయి. కొన్నిచోట్ల కూటమి నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఒక సమస్య! మరికొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ఇతర ముఖ్య నేతలను కలుపుకొని వెళ్లడంలేదు. ‘యువత’ కోటాలో సీట్లు సాధించి ఎమ్మెల్యేలుగా అయిన వారిలో పలువురు సీనియర్లను పక్కన పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరేమో మొదటి నుంచీ పార్టీలో ఉన్న వారిని కాదని... ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వైసీపీ నేతలను చేరదీసి, వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు తమ సొంత సామాజిక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తూ, ఇతరులను పట్టించుకోవడంలేదనే విమర్శలూ ఉన్నాయి. పార్టీ పెద్దలు ఇలాంటి నియోజకవర్గాలను గుర్తించి, సరిదిద్దకపోతే ఇబ్బందులు తప్పవు.
వినూత్నంగా...
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్థానికంగా అందుబాటులో ఉండరనే పేరున్నా... ఆ లోటు తెలియకుండా చూసుకుంటున్నారు. భవానీపురంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి... అందులో తన ప్రతినిధులను నియమించి... ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, పరిష్కరిస్తున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పటితో పోల్చితే ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. నిత్యం కార్యాలయంలో నిర్దిష్ట సమయం అందుబాటులో ఉండటం, వారంలో మూడురోజుల్లో నియోజకవర్గ పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. ‘నన్ను ప్రశ్నించవచ్చు’ అంటూ ప్రజలకు తన ఫోన్ నంబర్ ఇచ్చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మె ల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వ ని ధులను భారీగా రాబడుతూనే... తమ కుటుంబానికి చెందిన పీవీఆర్ ట్రస్టు ద్వారా భారీగా సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాగునీటి మంత్రిగా తీరికలేకుండా ఉన్నప్పటికీ... కాస్త సమయం దొరకగానే నియోజకవర్గంలో వాలిపోతున్నారు. కనీసం వారంలో రెండు రోజులు స్థానికంగా అందుబాటులో ఉంటూ... తానే ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి వారంలో మూడు రోజులు ‘గ్రీవెన్స్ డే’ నిర్వహిస్తున్నారు. రేషన్ మాఫియాను అరికట్టేందుకు ఆ దుకాణాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు కానీ ఫలితం లేదు.
మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా, వేరే జిల్లాలకు ఇన్‌చార్జిలుగా ఉన్నా వారానికి మూడు నాలుగు రోజులు సొంత నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
మీరు మారాలి సారూ...
పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యేకంటే... ఎన్నికలకు ఆర్నెల్ల ముందు టీడీపీలోకి వచ్చిన ఒక వైసీపీ నాయకుడిదే హవా! ఆయన ప్రతీ దానికొక రేటు పెట్టారు. ప్రజలెవరైనా సాయం కోరి వెళ్తే, ‘ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకునే ఓట్లేశారుగా. ‘షాడో’ దగ్గరికెళ్లి కప్పం కట్టి పనులు చేయించుకోండి’ అని స్వయంగా ఎమ్మెల్యేనే సూచిస్తున్నారు. మైనింగ్ నుంచి ఉద్యోగుల బదిలీల వరకు పైసా అందనిదే పని జరగదు. షాడో ఎమ్మెల్యే సొంత వెంచర్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయించారు.
ఇదే పల్నాడు జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యేకు గతంలో సౌమ్యుడిగా, మంచి పేరే ఉండేది. ఈసారి మాత్రం ఆయన తన ‘న్యూ అవతార్’ చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరికి... నియోజకవర్గంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో తన మనుషులను పెట్టి... ‘మేం చెప్పిందే చేయాలి’ అంటూ ఫైళ్లతో బేరాలు ఆడుతున్నారట.
పల్నాడు జిల్లాకే చెందిన ఒక ఎమ్మెల్యే ఏకంగా ఏడుగురు పీఏలను పెట్టుకున్నారు. ఒక్కో పీఏకు ఒక్కో ‘శాఖ’ అప్పగించేశారు. ‘ఎమ్మెల్యే గారి పీఏను’ అంటూ వస్తున్న ఫోన్లతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అనుచరులే పేకాట, బెట్టింగ్‌లు, గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నంద్యాల జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తీరు మరీ వివాదాస్పదంగా మారింది. చికెన్ షాపుల నుంచీ మామూళ్లు వసూలు చేస్తున్నారని, పార్టీ కార్యక్రమం నిర్వహణకు పంచాయతీ కార్యదర్శుల నుంచి డబ్బులు వసూలు చేశారని, మాట వినని ఉద్యోగులను లాక్కొచ్చి కొడుతున్నారని... ఇలా అనేక ఆరోపణలు.
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వ్యక్తిగత సహాయకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆయనను కలవొచ్చు. సమస్యల
పరిష్కారం కోసం వచ్చిన ప్రజల ముందే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడతారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆ కోపమంతా నియోజకవర్గ ప్రజలమీద, అధికారుల మీద చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. క్యాడర్‌నూ దూరం పెట్టేశారు. ఎవరు వెళ్లి ఏం అడిగినా...‘పీఏతో మాట్లాడండి’ అనే సమాధానం ఇస్తున్నారు.
పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వారంలో నాలుగు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని తన అనుచరులకు నిత్యం చెబుతుంటారు. ప్రభుత్వపరంగానూ, వ్యక్తిగతంగానూ వీలైనంత సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కేంద్ర, రాష్ట్ర పథకాలను లోతుగా అధ్యయనం చేస్తూ... వాటి ద్వారా గరిష్ఠంగా నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ‘శివశక్తి ఫౌండేషన్’ ద్వారా పాతికేళ్లుగా సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీలోనూ ఆయనకు అభిమానులుండటం విశేషం.
మీరు మారారు సార్...
ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలో రకరకాలుగా రెచ్చిపోయిన, తొలి అడుగులో తడబాటు పడ్డ చాలామంది రెండో ఏడాదికి పద్ధతి మార్చుకున్నారు. అధిష్ఠానం హెచ్చరికల ఫలితమో, ప్రజల నుంచి వస్తున్న ‘ఫీడ్ బ్యాక్’ను పరిగణనలోకి తీసుకున్నందుకో... ఏదేమైనా వీరి పనితీరులో రెండో ఏడాది స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దందాలు చేస్తున్న అనుచరులను అదుపు చేయడం, నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండటం, సమస్యలపై సత్వరం స్పందించడం వంటి చర్యలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే... వచ్చే ఎన్నికల్లోనూ వీరికి తిరుగుండదు.
మంచిని ముంచేయకుండా...
కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అనేక పనులు పరుగులు పెడుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా అభివృద్ధి పనులు కళ్లకు కనిపిస్తున్నాయి. రహదారులతో గ్రామీణ ముఖ చిత్రం మారుతోంది. ప్రతి నియోజకవర్గానికీ వందల కోట్లలో నిధులు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు చక్కగా సాగుతున్నాయి. చెరువులు కళకళలాడుతున్నాయి. వైసీపీ హయాంలో ఎక్కడికక్కడ పడకేసిన అనేక పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. కొన్ని శరవేగంగా జరుగుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మొత్తంగా ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. సామాజికంగా, సామూహికంగా జరుగుతున్న మంచి ఇది! కానీ... ప్రజలను ఇబ్బంది పెట్టేలా కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు ఈ మంచిని ముంచేయకుండా చూసుకోవాలి. నియోజకవర్గాలకు దూరంగా ఉండే వారు పద్ధతి మార్చుకోవాలి.
అధినేతలు అదిలిస్తున్నా...
‘పార్టీయే సుప్రీం. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే పక్కన పెట్టేస్తా. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు’ అని టీడీపీ అధినేత, చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటు... జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేస్తున్నారు. కానీ... కొందరు ఎమ్మెల్యేలు దీనిని సీరియ్‌సగా తీసుకోవడంలేదు. ‘ఒక్కసారి ఉన్నా చాలు... ఇప్పుడే కుమ్మేద్దాం’ అంటూ దందాలు సాగిస్తున్నారు. మహిళా కోటా, డీలిమిటేషన్ తదితర మార్పుల నేపథ్యంలో తమకు మళ్లీ అవకాశం దక్కుతుందో లేదో అనే కోణంలో ఆలోచిస్తుండటం గమనార్హం! ఇలాంటి వారిని నియంత్రించలేక అధినేతలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
