Share News

స్మార్ట్‌ గవర్నెన్సుపై మంత్రులకు శిక్షణ

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:06 AM

పాలనలో వేగం పెంచడం, టెక్నాలజీని అనుసంధానించడం, పూర్తిస్థాయి పారదర్శకతతో సుపరిపాలన అందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

స్మార్ట్‌ గవర్నెన్సుపై మంత్రులకు శిక్షణ

  • సింగపూర్‌ వెళ్లనున్న 9మంది మంత్రులు

  • 21 నుంచి 27 వరకు పర్యటన

అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): పాలనలో వేగం పెంచడం, టెక్నాలజీని అనుసంధానించడం, పూర్తిస్థాయి పారదర్శకతతో సుపరిపాలన అందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పద్ధతులను మెరుగుపరుస్తూ, అవినీతిని నియంత్రించేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇప్పటికే చాలా నిర్ణయాలు, పాలసీలను కూటమి ప్రభుత్వం రూపొందించింది. అధికార యంత్రాంగంతోపాటు.. పాలనలో కీలకమైన మంత్రులకు శిక్షణ అవసరమని భావిస్తోంది. దీంట్లో భాగంగా 9 మంది మంత్రులకు వివిధ అంశాల్లో అవగాహన, శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 27వరకు 9 మంది మంత్రుల బృందం సింగపూర్‌లో పర్యటించనుంది. ఇందులో మంత్రులు పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్‌ రెడ్డి, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ప్లానింగ్‌ విభాగం సీనియర్‌ అధికారులు కూడా ఈ బృందంతో కలిసి సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ ప్రోగ్రామ్‌గా రూపొందించారు. ఇక్కడ శిక్షణ పొందిన మంత్రులు తిరిగి వచ్చాక రాష్ట్రంలోని ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణ ఇచ్చే ‘లీడ్‌ ట్రైనర్లుగా‘ వ్యవహరిస్తారు.


పర్యటనలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రత్యేక అంశంపై శిక్షణ ఉంటుంది. మొదటి రోజు నేషన్‌ ఫస్ట్‌ అనే అంశంపై శిక్షణ. రెండో రోజున ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ సేవలను ప్రజలకు చేరవేసే విధానంపై, మూడో రోజున అత్యవసర సమయాల్లో సంక్షోభాలను ఎలా ఎదుర్కొవాలి అనే అంశంపై, నాలుగో రోజున అత్యంత కీలకమైన డిజిటల్‌ గవర్నమెంట్‌, సాంకేతిక పరిజ్ఞానం అమలుపై, ఐదో రోజున ఆర్థిక వృద్ధిపై, ఆరో రోజున పాలనపై ప్రజల్లో విశ్వాసం కలిగించడం, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణ ఉంటుంది. చివరిగా ఏడో రోజున కార్యాచరణ ప్రణాళికపై చర్చించి.. శిక్షణ ముగిస్తారు.

Updated Date - Apr 13 , 2026 | 06:10 AM