మద్యం సీసాలతో సర్క్యులర్ ఎకానమీ!
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:55 AM
వాడి పడేస్తున్న మద్యం సీసాలతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల వాటితో సర్క్యులర్ ఎకానమీ విధానం రూపొందించాలని మంత్రుల బృందం అభిప్రాయపడింది.
వాడి పడేస్తున్న సీసాల రీసైక్లింగ్‌పై అధ్యయనం
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): వాడి పడేస్తున్న మద్యం సీసాలతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల వాటితో సర్క్యులర్ ఎకానమీ విధానం రూపొందించాలని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఎక్సైజ్ పాలసీలపై ఏర్పాటైన మంత్రుల బృందం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, నాందెడ్ల మనోహర్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2025-26లో రాష్ట్రంలో 215 కోట్ల మద్యం సీసాల వినియోగం జరిగిందని, సరైన విధానంలో పారేయకపోవడం వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయని మంత్రుల బృందం అభిప్రాయపడింది. సేకరణ, రీసైక్లింగ్, పునర్వినియోగం లాంటి సర్క్యులర్ ఎకానమీ విధానాలు ఈ సమస్యలను తగ్గిస్తాయని పేర్కొంది. ఇతర రాష్ర్టాల్లో ఎలాంటి విధానాలు అమలవుతున్నాయో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది.