Share News

సింగపూర్‌లో ఏపీ మంత్రులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:48 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం మంత్రుల బృందం చేపట్టిన సింగపూర్‌ పర్యటన సానుకూల వాతావరణంలో సాగుతోంది.

సింగపూర్‌లో ఏపీ మంత్రులు

  • విదేశీ వ్యవహారాల మంత్రితో చర్చలు

  • హవర్‌ టాంపైన్స్‌ హబ్‌ను సందర్శించిన మంత్రులు

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం మంత్రుల బృందం చేపట్టిన సింగపూర్‌ పర్యటన సానుకూల వాతావరణంలో సాగుతోంది. పర్యటనలో భాగంగా మంత్రులు మొదటి రోజైన మంగళవారం పౌర సౌకర్యాలు, స్మార్ట్‌సిటీ మేనేజ్‌మెంట్‌, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. తొలుత సింగపూర్‌ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్‌ సియో హువాంగ్‌తో ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. భారత్‌ హైకమిషనర్‌ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్‌రెడ్డి, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, అనగాని సత్యప్రసాద్‌ పాల్గొన్నారు. భారత్‌-సింగపూర్‌ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, మౌలిక వసతులు, లాజిస్టిక్స్‌, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారం, ఫిన్‌టెక్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్మార్ట్‌ సిటీస్‌, అర్బన్‌ ప్లానింగ్‌, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్‌ నైపుణ్యాన్ని ఏపీలో వినియోగించుకోవడం, ఏపీ యువతకు వృత్తిపరమైన విద్య, శిక్షణ కార్యక్రమాల్లో సింగపూర్‌ సహకారంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతమవుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రుల బృందం అవర్‌ టాంపైన్స్‌ హబ్‌ను సందర్శించింది. అక్కడ క్రీడలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రజా సౌకర్యాలన్నీ ఒకేచోట చేర్చి ఒక గొప్ప రిక్రియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దిన విధానాన్ని మంత్రులు పరిశీలించారు. వాటితోపాటు ఫెస్టివ్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ను సందర్శించి సింగపూర్‌ సామాజిక నిర్మాణం, ప్రజలకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలపై అధికారుల ద్వారా ప్రజెంటేషన్‌ తీసుకున్నారు. అనంతరం సింగపూర్‌ మంత్రి గన్‌ సియో హువాంగ్‌ అక్కడి విశిష్ట పరిపాలనా విధానమైన మీట్‌ ది పీపుల్‌ సెషన్‌ గురించి మంత్రుల బృందానికి ప్రత్యేకంగా వివరించారు.

Updated Date - Apr 22 , 2026 | 05:50 AM