Share News

బురదజల్లితే జైలుకు పంపిస్తాం: కొల్లు

ABN , Publish Date - May 23 , 2026 | 06:09 AM

‘లిక్కర్‌ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే నిజాలు బయటపెట్టి జైలుకు పంపుతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైన్స్‌, ఎక్సైజ్‌ శాఖలను భ్రష్టు పట్టించారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

బురదజల్లితే జైలుకు పంపిస్తాం: కొల్లు

అనంతపురం కలెక్టరేట్‌, తుగ్గలి, మే 22(ఆంధ్రజ్యోతి): ‘లిక్కర్‌ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే నిజాలు బయటపెట్టి జైలుకు పంపుతాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైన్స్‌, ఎక్సైజ్‌ శాఖలను భ్రష్టు పట్టించారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో, అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. కేవలం కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, విధ్వంసాలే ప్రధాన అజెండాగా పాలన సాగింది. గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన శాఖలను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్రంలో గొప్ప గనుల నిల్వలు ఉన్నాయి. ఒడిశా తరువాత అత్యధిక ఐరన్‌ ఓర్‌ సామర్థ్యం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో సోలార్‌ ప్యానెల్స్‌కు అవసరమైన క్వార్ట్జ్‌ నిక్షేపాలను గుర్తించాం. కేంద్రం సహకారంతో విశాఖపట్నంలో రెండు రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. అమరావతి రైతులు రాజధానికి మరిన్ని భూములు అందిస్తామని ముందుకు వస్తుంటే, వారిని తప్పుదోవ పట్టించేలా జగన్‌ వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలందరూ ఐక్యతగా ఉండటం వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పనిచేయాలి’ అని మంత్రి కొల్లు పిలుపునిచ్చారు.

Updated Date - May 23 , 2026 | 06:10 AM