Share News

విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గించే యోచనలో సీఎం: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:04 AM

విద్యుత్‌ చార్జీలను ఇంకా తగ్గించే దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గించే యోచనలో సీఎం: మంత్రి గొట్టిపాటి

  • ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా పెంచలేదు

  • చార్జీలను ట్రూడౌన్‌ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాం: గొట్టిపాటి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలను ఇంకా తగ్గించే దిశగా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాలకు సంబంధించి విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో రూ150 కోట్లతో చేపట్టనున్న పనులను మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే రూ.485 కోట్లతో విద్యుత్‌ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచితే తమ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. గతంలో ట్రూఅప్‌ చార్జీలను పెంచారని, తాము ట్రూడౌన్‌ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించామన్నారు. ఎన్నడూలేనివిధంగా రికార్డు స్థాయిలో ధర్మల్‌ విద్యుదుత్పత్తి చేసినట్టు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిన ఏకైక సీఎం చంద్రబాబు అని, అటువంటి అనుభవశాలి పుట్టిన రోజునాడు జిల్లాలో విద్యుత్‌ అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఉండేవని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి కోతలు లేవన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 04:06 AM