రీ-డెమోకు సిద్ధం కండి!
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:30 AM
వైద్య పరికరాల టెండర్లను అస్మదీయ కంపెనీని కట్టబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు.
డిస్‌క్వాలిఫై అయిన కంపెనీలకు మరో చాన్స్
ఏపీఎంఎస్ఐడీసీ వెంటిలేటర్ల టెండర్లలో సరికొత్త నిబంధనలు
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వైద్య పరికరాల టెండర్లను అస్మదీయ కంపెనీని కట్టబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. టెండర్ ప్రక్రియలో సాంకేతిక పరిశీలనతో పాటు వైద్య పరికరాల డెమో కూడా ముగిసిన తర్వాత తాము అనుకున్న కంపెనీలకు అర్హత కల్పించేందుకు సిద్ధపడుతున్నారు. సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కొత్త రూల్స్ ప్రవేశపెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవరిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన అనస్థీషియా మిషన్లు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్ లైట్ల కోసం ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు గతేడాది టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం, కంపెనీల నుంచి స్పందన లేకపోవడంతో ఈ ఏడాది జనవరిలో మరోసారి టెండర్లు పిలిచారు. వెంటిలేటర్ల కొనుగోలుకు ప్రత్యేకంగా టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 9 కంపెనీలు పాల్గొన్నాయి. సాంకేతికాంశాల పరిశీలన, ఆ తర్వాత జరిగిన డెమోలో 3 కంపెనీలను ఎంపిక చేశారు. అయితే ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి వెంటిలేటర్ల సరఫరా టెండర్లు కట్టబెట్టాలని కార్పొరేషన్‌లో కీలక అధికారి నిర్ణయించారు. ఆ కంపెనీకి అర్హత కల్పించేందుకు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా గురువారం హడావిడిగా ఒక జూమ్ మీటింగ్ నిర్వహించారు. టెక్నికల్ ఎవాల్యూయేషన్, డెమోలో డిస్‌క్వాలిఫై అయిన కంపెనీలకు మరో అవకాశం ఇవ్వాలని అందులో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కంపెనీల వెంటిలేటర్లతో ఈ నెల 24న డెమో ఇచ్చేందుకు అనుమతి ఇచ్చేశారు. ఫైనాన్షియల్ బిడ్ తెరవాల్సిన సమయంలో తాను ముడుపులు తీసుకున్న కంపెనీకి టెండర్ కట్టబెట్టేందుకు ఓ ఉన్నతాధికారి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వెనుక కార్పొరేషన్‌లోని ఎక్పిప్‌మెంట్ విభాగం అధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.