Share News

మామిడి ధర ఢమాల్‌

ABN , Publish Date - May 04 , 2026 | 03:46 AM

యుద్ధం ప్రభావం వల్ల గల్ఫ్‌ దేశాలకు మన ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది ఈ సీజన్‌లో అధికంగా వచ్చే మామిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగుమతులు లేక.. ధర పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

మామిడి ధర ఢమాల్‌

  • విదేశాలకు నిలిచిన ఎగుమతులు

  • పొరుగు రాష్ట్రాల్లో అమ్మినా నష్టాలే

  • రూ.30 మించని నంబర్‌వన్‌ బంగినపల్లి

  • తోతాపురి ధర పతనం

  • మామిడి రైతు కుదేలు

(ఆంధ్రజ్యోతి, విస్సన్నపేట/రెడ్డిగూడెం/ఇబ్రహీంపట్నం)

యుద్ధం ప్రభావం వల్ల గల్ఫ్‌ దేశాలకు మన ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది ఈ సీజన్‌లో అధికంగా వచ్చే మామిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగుమతులు లేక.. ధర పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసలే నల్లి తామరతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక అల్లాడుతున్న రైతులను... ధర పతనం మరింత కుంగదీస్తోంది. ఏటికేడాది ధర లేక మామిడి రైతులు కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ఏడాది అయినా ధరలు ఆశించిన స్థాయిలో ఉంటాయనుకుంటే.. పశ్చిమాసియా యుద్ధంతో ఎగుమతులు ఆగిపోవడం, హోటల్స్‌ మూతపడటం, డీజిల్‌ సంక్షోభం వంటి ప్రతికూల పరిస్థితులు రైతుల మార్కెటింగ్‌ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే సైజులను బట్టి కాయలు కోయాల్సి ఉండగా, కూలీల కొరతతో కోతలు సాగలేదు. ఏప్రిల్‌ ముగింపులో కాయలన్నీ ఒకేసారి కోతకు రావడం, మార్కెట్‌లోకి ఒకేసారి కాయలు పెద్ద ఎత్తున రావడంతో ధరలు పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. ఢిల్లీ సేఠ్‌లు (కమీషన్‌ వ్యాపారులు) సిండికేట్‌గా ఏర్పడి ధరలు పెరగకుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మరోపక్క నల్లి తామర వల్ల ఈ ప్రాంతంలోని తోటల్లోని మామిడి కాయలు నాణ్యత లేక.. ఇతర ప్రాంతాల కాయలతో పోటీ పడలేకపోతున్నాయి. ఈ కారణంతో ధరలు పతనమయ్యాయని రైతులు వాపోతున్నారు.


తోతాపురి ధర అమాంతం పతనం

తోతాపురి (కలెక్టర్‌) రకం మామిడి ధరలు అమాంతం పతనమయ్యాయి. ప్రస్తుతం తోతాపురి కాయ రూ.4-7 ఉంది. యుద్ధ సమయంలో పంపించిన జ్యూస్‌ వెనక్కి రావడంతో.. తోతాపురిని కొనేందుకు జ్యూస్‌ ఫ్యాక్టరీ యజమానులు ముందుకు రాకపోవడం ధర పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది.

పొరుగు రాష్ట్రాలకు పంపినా

బంగినపల్లి రకం మామిడికాయలను కొందరు రైతులు నాందేడ్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లినా.. అక్కడా ధర రావట్లేదు. అక్కడ కాయకు రూ.20, రూ.30 మాత్రమే లభిస్తుండటంతో ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌, అమరావతి, ఇండోర్‌ వంటి నగరాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరగడం లేదని, అందుకే ధరలపై ప్రభావం పడిందని అక్కడి సేఠ్‌లు అంటున్నారు.

కాయలకు కవర్లు కట్టినా..!

కోతల ప్రారంభ సమయంలో కవర్లలో పండించిన మామిడి టన్ను రూ.1.7 లక్షలు, రూ.1.80 లక్షలు పలికింది. ప్రస్తుతం ఆ కాయలకూ గిరాకీ బాగా తగ్గింది. నాందేడ్‌, అమరావతి మార్కెట్‌లో కవర్ల్లు కట్టిన మామిడికాయలు టన్ను రూ.50-60 వేలే పలుకుతోందని అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్‌ జిల్లా రైతులు వాపోతున్నారు.


టన్నుకు క్వింటాన్నర కాయలు తరుగు

మామిడి కాయల కొనుగోలు సమయంలో టన్ను కాయలకు క్వింటాన్నర కాయలను తరుగు కింద తీయడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాణ్యత లేనందునే తరుగు కింద కాయలు తీస్తున్నామని కమీషన్‌ వ్యాపారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు.

తోటలను వదిలేయడం మేలు

-రాయల రామారావు (తెల్లదేవరపల్లి)

నాకు 15 ఎకరాల తోట ఉంది. మొత్తం తోతాపురి రకం. మొత్తం కాయలు చేతికొచ్చేందుకు రూ.5 లక్షలు ఖర్చయింది. 30 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.7 వేలకు కొన్నారు. రూ.2.10 లక్షలు వచ్చిం ది. రూ.2.90 లక్షలు నష్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో తోటలను గాలికొదిలేయడం మేలు.

Updated Date - May 04 , 2026 | 03:48 AM