Share News

ఎఫ్‌ఆర్‌ఎస్‌కు అంగీకరిస్తేనే అడ్మిషన్‌

ABN , Publish Date - May 13 , 2026 | 05:06 AM

ఉన్నత విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకురానుంది. ముఖ ఆధారిత హాజరు..

ఎఫ్‌ఆర్‌ఎస్‌కు అంగీకరిస్తేనే అడ్మిషన్‌

  • ఉన్నత విద్యలో ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకురానుంది. ముఖ ఆధారిత హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్‌) నమోదుకు అంగీకారం తెలిపితేనే విద్యార్థులకు అడ్మిషన్‌ ఇవ్వనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలుచేయాలని ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఎఫ్‌ఆర్‌ఎస్‌కు పోర్టల్‌లో నమోదు చేసుకున్న కాలేజీలకే అఫిలియేషన్లు పునరుద్ధరిస్తోంది. దీంతో కాలేజీల సిబ్బంది మొత్తం వివరాలను ఎఫ్‌ఆర్‌ఎ్‌సకు నమోదుచేస్తున్నారు. విద్యార్థులకు కూడా అమలుచేయనున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో హాజరుకు అంగీకరించకపోతే వారికి అడ్మిషన్‌ ఇవ్వరు. కొన్ని కోర్సులకు అసలు తరగతులే నిర్వహించకుండా కొన్ని విద్యా సంస్థలు గోల్‌మాల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా బీఈడీ కాలేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. పీజీ కోర్సుల్లోనూ హాజరు తక్కువగానే ఉంటోంది. చాలా మంది విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకోవడం తప్ప ఒక్కసారీ కాలేజీ ముఖం చూడట్లేదు. చివర్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులై సర్టిఫికెట్లు పొందుతున్నారు. మాన్యువల్‌ హాజరులో రికార్డులు తారుమారు చేసి సరిపడా హాజరు చూపిస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఒక్కటే మార్గమని ఉన్నత విద్యాశాఖ భావించింది. కొత్తగా కాలేజీలు ప్రారంభించాలనుకునే వారికీ అధికారులు ఇదే విషయం స్పష్టంచేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో రోజూ ఉదయం, సాయంత్రం... విద్యార్థులు, విద్యా సంస్థల సిబ్బంది ముఖ ఆధారిత హాజరు నమోదుచేయాలి. ఐరి్‌సతో అనుసంధానం చేసి ఫొటోలు తీయడం ద్వారా ఈ హాజరు నమోదవుతుంది. ఆయా కాలేజీలకు జియో ఫెన్సింగ్‌ రికార్డు చేయడం వల్ల పనిచేసే సిబ్బంది, అక్కడ చదివే విద్యార్థులు అక్కడికి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తేనే అది నమోదవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమలుచేస్తున్నారు. అతి కొద్ది శాఖలకు మినహా అందరూ ఈ విధానంలోనే హాజరు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల హాజరు గణనీయంగా పెరిగింది. సమయపాలన కచ్చితంగా పాటిస్తున్నారు.


నేడూ ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగియగా బుధవారం రూ.5వేలు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని మంగళవారం తెలిపింది. విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో చివరి అవకాశం కల్పించింది.

Updated Date - May 13 , 2026 | 05:06 AM