Share News

త్వరలోనే స్థానిక ఎన్నికలు!

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:38 AM

రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామపంచాయితీలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌....

త్వరలోనే స్థానిక ఎన్నికలు!

  • ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన వారంలో ఎస్‌ఈసీ నియామకం

  • గవర్నర్‌కు చేరిన సంబంధిత ఫైలు

  • బీసీ జనాభా లెక్క పదిరోజుల్లో పూర్తి

  • మరిన్ని వివరాలతో అఫిడవిట్‌ వేస్తాం

  • విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోండి

  • తర్వాతే ఉత్తర్వులు జారీ చేయండి

  • హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి నివేదన

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామపంచాయితీలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రానున్న వారం రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్ఈసీ) నియామకం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన ఫైలు గవర్నర్‌ వద్దకు చేరిందని వివరించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు దాదాపు కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటివరకు 99.44 శాతం మేరకు వివరాలు సేకరించారని మరో 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ ఏర్పాటు చేసిందని, బీసీల వెనుకబాటుతో పాటు అన్ని అంశాలను పరిశీలించే అధికారం కమిషన్‌కు ఉందని పేర్కొన్నారు. పంచాయితీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,096 గ్రామపంచాయితీల పాలనా వ్యవహారాలు చూసుకునేందుకు 5,770 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు. వారు బాధ్యతలు కూడా తీసుకున్నారని నివేదించారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని, దానిని పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం.. అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.


ఇవీ.. వ్యాజ్యాలు

రాష్ట్రంలో బీసీ జనగణన చేపట్టడంతో పాటు తదనుగుణంగా రిజర్వేషన్‌ ఖరారు చేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కోరుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థలు, గ్రామపంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2025లో హైకోర్టులో పిల్‌ వేశారు. మరోవైపు రాష్ట్రంలోని 13,325 గ్రామపంచాయితీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో పదవీకాలం ముగియనుందని, ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశ్‌ మరో పిల్‌ దాఖలు చేశారు. గ్రామ పంచాయితీ సర్పంచులుగా తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ మరికొందరు సర్పంచులు వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కేశన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ. సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు. ‘‘బీసీ జనగణన చేపట్టాలని హైకోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ జీవోలో బీసీ జన గణన చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. బీసీ గణన చేపట్టకుంటే రిజర్వేషన్‌ ఖరారులో బీసీలకు అన్యాయం జరగుతుంది.’’ అని వివరించారు. మరో పిటిషనర్‌, న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం పదవీకాలం ముగియకముందే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకుని తక్షణం ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి.’’ అని కోరారు. సర్పంచుల తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేవరకు సర్పంచుల కాలపరిమితిని పొడిగించాలని అభ్యర్థించారు.

Updated Date - Apr 08 , 2026 | 04:38 AM