ఆర్డర్ పట్టు.. కోట్లు కొట్టు!
ABN , Publish Date - Mar 08 , 2026 | 06:47 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌లో రూ.3,500 కోట్లు దోచుకోగా.. ఆ ‘ముడుపుల’ గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విప్పుతోంది.
అడ్డగోలుగా దోచుకున్న లిక్కర్ గ్యాంగ్.. జగన్ హయాంలో మద్యంలో 3500 కోట్ల దోపిడీ
ఇందులో 1048 కోట్ల ‘గుట్టు’ విప్పిన ఈడీ
10 డిస్టిలరీల నుంచి 795 కోట్లు వసూలు
వాటి పేర్లు, ముడుపుల వివరాలు వెల్లడి
అత్యధికంగా తిలక్ ఇండస్ట్రీస్ నుంచి 200 కోట్లు
సిండికేట్ లిక్కర్ ద్వారా మరో 254 కోట్లు ఆర్జన
కుట్రలో విజయసాయి, రాజ్ కసిరెడ్డి భాగస్వాములు
మిగతా ‘సొమ్ము’ను గుర్తించే దిశగా ఈడీ దర్యాప్తు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌లో రూ.3,500 కోట్లు దోచుకోగా.. ఆ ‘ముడుపుల’ గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విప్పుతోంది. ఇప్పటి వరకు రూ.1048.45 కోట్ల మనీ ట్రయల్ జరిగినట్టు దర్యాప్తులో తేల్చిన ఈడీ... ముడుపుల రూపంలో పది డిస్టిలరీల నుంచి లిక్కర్ గ్యాంగ్ రూ.794.77 కోట్లు వసూలు చేయగా, మరోవైపు నిందితులు సొంతంగా 4 మద్యం కంపెనీలు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు లిక్కర్ విక్రయించడం ద్వారా రూ.253.68 కోట్లు కొల్లగొట్టినట్టు ఆధారాలతో సహా బయట పెట్టింది. మద్యం ముడుపులతో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు కొనుగోలు చేసిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మిగతా సొమ్ము మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ముడుపులిచ్చిన కంపెనీలకు నిందితులు భారీగా ఆర్డర్లు ఇచ్చి నగదుతో పాటు బంగా రం కాయిన్ల రూపంలోనూ తీసుకున్నారు. అత్యధికంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రూ.1472 కోట్లు, శర్వాణీ ఆల్కో రూ.881 కోట్లు, ఈగల్ డిస్టిలరీస్ రూ.822 కోట్లు విలువైన మద్యం ఆర్డర్లు పొంది అందుకు ప్రతిఫలంగా ముడుపులు చెల్లించాయి.
తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యధికంగా 200 కోట్ల ముడుపులు ఇచ్చింది. మరోవైపు నిందితులు సొంత కంపెనీల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయించి వందల కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని ఈడీ వివరించింది. షెల్ కంపెనీల ద్వారా జరిగిన నగదు మార్పిడిలో ఐదుగురు మధ్యవర్తుల పేర్లు వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆదాన్ డిస్టిలరీ్‌సకు అప్పు ఇప్పించి లబ్ధి పొందినట్లు తేల్చింది. లిక్కర్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లు పరిశీలించిన ఈడీ.. ఈ స్కామ్‌లో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించి పీఎంఎల్‌ఏ కింద ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యులు, అధికారులు, లిక్కర్ వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి భారీ స్కామ్ చేసినట్లు తేల్చింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఈ కుట్రలో భాగస్వాములుగా పేర్కొంది. ఎలాంటి డిస్టిలరీ లేకుండానే 2019 నవంబరులో ఆదాన్ డిస్టిలరీ్‌సను ప్రారంభించి అందులో డైరెక్టర్లుగా తమ మనుషుల్ని నియమించినట్లు వెల్లడించింది. పెట్టుబడి కింద రూ.62.25 కోట్లను విజయసాయిరెడ్డి తన అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు శరత్‌చంద్రా రెడ్డి ద్వారా సమకూర్చి మద్యం వ్యాపారంలో లబ్ధిపొందినట్లు వివరించింది.
గత ప్రభుత్వంలో పలుకుబడి ఉండటంతో విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రోస్ డిస్టిలరీలను స్వాధీనం చేసుకుని భారీగా మద్యం ఆర్డర్లు తమ సొంత బ్రాండు(సుప్రీం బ్లెండ్ విస్కీ)కు పొందినట్లు తెలిపింది. మాన్యువల్ వ్యవస్థను దుర్వినియోగం చేసి కొన్ని స్థిరమైన బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించడం, ప్రత్యేక బ్రాండ్లకు అనుకూలంగా సప్లయ్ ఆర్డర్లను ఇవ్వడం, కిక్‌బ్యాక్‌లు తీసుకున్నట్లు విచారణలో తేలింది. కొత్త బ్రాండ్ల ను అధిక ధరలతో విక్రయించడం వల్ల డిస్టలరీలు అధిక లా భాలు పొందాయి. దీంతో ప్రతి కేసుపై 15-20ు కిక్‌బ్యాక్ ఇ వ్వాలని డిస్టిలరీలపై ఒత్తిడి తెచ్చినట్లు ఈడీ తేల్చింది. ఈ వ్యవహారంలో బూనేటి చాణక్య, ముప్పిడి అవినాశ్‌రెడ్డి, మహమ్మద్ సైఫ్ ముఖ్య పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది.
ప్రతినెలా 100 కోట్ల అక్రమార్జన
లిక్కర్ స్కామ్‌లో సుమారు రూ.3500 కోట్ల కిక్ బ్యాక్‌లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు బూనేటి చాణక్య, ఎం అవినాశ్‌రెడ్డి, టి ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పైలా దిలీప్, సైఫ్‌లతో పాటు మరికొందరు ఈ కిక్‌బ్యాక్‌లో భాగస్వాములైనట్లు పేర్కొంది. ప్రతి నెలా సుమారు రూ.100 కోట్లు అక్రమ ఆదాయం సంపాదించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డిని విచారించింది. తాజాగా ముప్పిడి అవినాశ్ రెడ్డిని ప్రశ్నించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి మరిన్ని ఆధారాలతో కుంభకోణం సొమ్ము మొత్తాన్ని గుర్తించే పనిలో ఈడీ నిమగ్నమైంది.