మద్యనిషేధం అంటూ 3500 కోట్ల దోపిడీ: డోలా
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:46 AM
మద్యం కుంభకోణంలో రోజుకొక గొడ్డలి పార్టీ నాయకుడి పేరు బయటకు వస్తోందని, మద్యనిషేధం అంటూ మాయమాటలు చెప్పి రూ.3500 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనత వైసీపీదని..
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రోజుకొక గొడ్డలి పార్టీ నాయకుడి పేరు బయటకు వస్తోందని, మద్యనిషేధం అంటూ మాయమాటలు చెప్పి రూ.3500 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనత వైసీపీదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో దానినుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు డీఎస్సీ స్కాం అంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పీఏ కేఎన్‌ఆర్ వేల కోట్లు దోచుకున్నాడంటే జగన్ ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. కల్తీ మద్యంతో 30వేల మంది ఆడపడుచుల ఉసురు తగిలే జగన్ 11 సీట్లకు పరిమితమయ్యాడని విమర్శించారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి, సినిమాలు తీసి, విదేశాల్లో జల్సాలు చేశారని, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ వ్యాపారాలు, దుబాయ్‌లో షెల్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును దారి మళ్లించారని ఆరోపించారు.