Share News

ఇలాగైతే సాగునీటి భద్రత ఎలా?

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:46 AM

రాష్ట్రంలో నదుల అనుసంధానం, ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపడం, ఎత్తిపోతల పథకాలతో ఎక్కడిక్కడ నీటిని నిలుపుదల చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టాలను పెంచాలని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తున్నారు.

ఇలాగైతే సాగునీటి భద్రత ఎలా?

  • నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం

  • అప్పుడు, ఇప్పుడూ అదే విధానం కొనసాగింపు

  • 767 ఎత్తిపోతల్లో 7 లక్షల ఎకరాల ఆయకట్టు

  • వీటి నిర్వహణకు 1,639 కోట్లు అవసరం

  • బడ్జెట్‌లో కేటాయించింది 450 కోట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో నదుల అనుసంధానం, ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపడం, ఎత్తిపోతల పథకాలతో ఎక్కడిక్కడ నీటిని నిలుపుదల చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టాలను పెంచాలని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తున్నారు. అయితే బడ్జెట్‌లో అందుకు తగినట్లుగా కేటాయింపులు ఉండటం లేదని జలవనరుల, సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర మైనర్‌ ఇరిగేషన్‌కు నిధులు కేటాయింపుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2019-24 కాలంలో చిన్న తరహా నీటివనరుల అభివృద్ధికి సీఎంగా ఉన్న జగన్‌ ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 767 ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యానికి, విధ్వంసానికి గురయ్యాయి. వాటి నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని వరదలకు కొట్టుకుపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తిపోతల పథకాలకు పూర్వవైభవం వస్తుందని రాష్ట్ర సాగునీటి సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే జగన్‌ హయాంలో సాగిన ఆ నిర్లక్ష్యానికి కొనసాగింపుగానే చిన్నతరహా నీటి రంగానికి కేటాయింపులు ఉంటున్నాయని సాగునీటి నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


సాగునీటి భద్రత, సుస్థిరత ఉండాలంటే..

రాష్ట్రంలోని 767 ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తం 7,39,209 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే వీలుంది. ఆయా పథకాల నిర్వహణకు రూ.1,638.28 కోట్లు అవసరమవుతాయి. కానీ, ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఎత్తిపోతల పథకాల యాజమాన్య నిర్వహణకు రూ.450 కోట్లు మాత్రమే కేటాయించారు. 2026-27 బడ్జెట్‌లో చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ రూ.862 కోట్లు కేటాయించారు. ఈ నిధులను కూడా ఎత్తిపోతల పథకాల కోసం వినియోగించాలన్నా.. అర్ధ భాగమే నిధులు అందుబాటులో ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలో సాగునీటి భద్రత, సుస్థిరత ఉండాలంటే.. సాగునీటి యాజమాన్య నిర్వహణ విధానాలు, లస్కర్లు ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఆర్థిక శాఖకు స్పష్టం చేసింది. ఇందుకోసం 2026-27 బడ్జెట్‌లో రూ.1,639 కోట్లు కేటాయించాలని కోరింది. అయితే. రూ.450 కోట్లు మాత్రమే కేటాయించడంతో.. చిన్నతరహా నీటి యాజమాన్య విధానం చేపట్టడం సాధ్యం కాదని జలవనరుల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.


జిల్లాల వారీగా నిధుల అవసరం ఇలా..

శ్రీకాకుళం జిల్లాలో 40 ఎత్తిపోతల పథకాల ద్వారా 37,164 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.97.48 కోట్లు, విజయనగరం జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాల (3,742 ఎకరాలు) నిర్వహణకు రూ.11.20 కోట్లు అవసరమవుతాయని జలవనరుల శాఖ భావిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 20 ఎత్తిపోతల పథకాల (4,763 ఎకరాలు) కోసం రూ.14 కోట్లు, అనకాపల్లి జిల్లాలో 9 పథకాల (1,873 ఎకరాలు)కు రూ.5.38 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 19 పథకాల (4,043 ఎకరాలు) నిర్వహణకు రూ.12 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కాకినాడ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాల (14,537 ఎకరాలు)కు రూ.32 కోట్లు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 3 పథకాల (6,146 ఎకరాలు)కు రూ.15 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 11 ఎత్తిపోతల పథకాల (24,345 ఎకరాలు)కు రూ.40 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో 13,813 ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాలకు రూ.23.58 కోట్లు, ఏలూరు జిల్లాలో 18 ఎత్తిపోతల పథకాల (23,333 ఎకరాలు)కు రూ.38 కోట్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో 108 ఎత్తిపోతల పథకాల (1,27,157 ఎకరాలు) నిర్వహణ కోసం రూ.291 కోట్లు, కృష్ణా జిల్లాలో 28 పథకాల (41,049 ఎకరాలు)కు రూ.79 కోట్లు, పల్నాడులో 127 ఎత్తిపోతల పథకాల (1,44,651 ఎకరాలు)కు రూ.347.67 కోట్లు, బాపట్ల జిల్లాలో 84 ఎత్తిపోతల పథకాల (1,05,539 ఎకరాలు)కు రూ.188.74 కోట్లు, ప్రకాశం జిల్లాలో 73 ఎత్తిపోతల పథకాల (45,066 ఎకరాలు)కు రూ.103 కోట్లు, నెల్లూరు జిల్లాలో 44 ఎత్తిపోతల పథకాల (13,172 ఎకరాలు)కు రూ.29.04 కోట్లు అవసరమని భావించారు.


తిరుపతి జిల్లాలో 9 పథకాల (1,650 ఎకరాలు)కు రూ.3.93 కోట్లు, చిత్తూరు జిల్లాలో ఆరు పథకాల (827 ఎకరాలు)కు రూ.3.36 కోట్లు, కడప జిల్లాలో 20 పథకాల (18,124 ఎకరాలు)కు రూ.46 కోట్లు, అనంతపురం జిల్లాలో 11 పథకాల (4,461 ఎకరాలు)కు రూ.45 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో రెండు పథకాల (872 ఎకరాలు)కు రూ.13.32 కోట్లు, కర్నూలు జిల్లాలో 47 పథకాల (30,418 ఎకరాలు)కు రూ.82.84 కోట్లు, నంద్యాల జిల్లాలో 35 పథకాల (56,226 ఎకరాలు)కు రూ.132.85 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

Updated Date - Apr 22 , 2026 | 05:47 AM