ప్రజాప్రతినిధుల ‘ఆటవిడుపు’
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:00 AM
నిత్యం బిజీబిజీగా ఉండే ప్రజాప్రతినిధులు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ కలబడ్డారు..! టగ్ ఆఫ్ వార్‌లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు.
బిజీ లైఫ్‌కు దూరంగా.. ఆటలతో సరదాగా..
కబడ్డీ కబడ్డీ అంటూ తలపడిన ఎమ్మెల్యేలు
టగ్ ఆఫ్ వార్‌లో సత్తా చాటిన నాయకులు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మొదలైన క్రీడా పోటీలు
విజయవాడ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నిత్యం బిజీబిజీగా ఉండే ప్రజాప్రతినిధులు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ కలబడ్డారు..! టగ్ ఆఫ్ వార్‌లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. వాలీబాల్ ఆడారు. 100 మీటర్ల పరుగుపందెంలో రేసుగుర్రాల్లా పరుగులు తీశారు. మహిళా ఎమ్మెల్యేలు సైతం పోటీల్లో పాల్గొన్నారు. వాలీబాల్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్ రేసుల్లో సత్తాచాటారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘ఆటవిడుపు’ పేరిట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. భేషజాలు వీడి హుషారుగా పాల్గొన్నారు. కబడ్డీ పోటీలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ భుజానికి గాయమైంది.
స్పీకర్‌పై డిప్యూటీ స్పీకర్ విజయం
ఆటవిడుపులో భాగంగా తొలుత టగ్ ఆఫ్ వార్ పోటీని నిర్వహించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. చివరికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు జట్టుపై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు టీమ్ విజయం సాధించింది. అనంతరం 100 మీటర్ల పరుగు పందెంలో పార్వతీపురం ఎమ్మెల్యే బి విజయచంద్ర విజయం సాధించారు.
మహిళా కెప్టెన్లు... పురుష క్రీడాకారులు
ఈ ఆటలపోటీల్లో మహిళా ప్రజాప్రతినిధులు కెప్టెన్సీతో పురుషులతో కూడిన తమ జట్లను ముందుకు నడిపించారు. వాలీబాల్‌లో ఒక జట్టుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మరో జట్టుకు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ కెప్టెన్లుగా వ్యవహరించారు. పురుష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ జట్లలో సభ్యులు. హోరాహోరీగా సాగిన పోరులో గ్రీష్మ జట్టు విజయం సాధించింది.
పోటీలు ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘ఆటవిడుపు’ పేరిట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంగళవారం ప్రారంభించారు. తొలుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు క్రీడాజ్యోతితో ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఈ జ్యోతిని స్పీకర్‌కి అందజేయగా... స్పీకర్, మండలి చైర్మన్ మోషేన్‌రాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు క్రీడా దీపాన్ని వెలిగించారు. క్రీడల ప్రారంభం సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. ఒత్తిడితో కూడిన జీవితానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ, లింగ భేదాలను మరిచి ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ... కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రతిపక్ష సభ్యులు ఆడాలని విజ్ఞప్తి చేశారు. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేందుకు కావలి గ్రీష్మతోపాటు మరో ముగ్గురు మాత్రమే ముందుకొచ్చారు. మిగిలిన వారు వెనుకంజ వేయడంతో పోటీలో పాల్గొనని వారికి సభలో మైక్ ఇవ్వనంటూ అయ్యన్నపాత్రుడు సరదాగా వ్యాఖ్యానించారు.