గ్రామీణాభివృద్ధిలో ఏపీ భేష్!
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:21 AM
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖల మంత్రి శివరాజ్‌సింగ్ కొనియాడారు.
ఉత్తమ విధానాలను అవలంబిస్తోంది
ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లో వర్షాభావం
111 జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్
న్యూఢిల్లీ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖల మంత్రి శివరాజ్‌సింగ్ కొనియాడారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రీయ గ్రామీణ్ వికాస్ సమ్మేళన్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో ఏపీ ఉత్తమ విధానాలను పాటిస్తోందన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం అమలుకు నోటిఫికేషన్, నిధుల కేటాయింపును విజయవంతంగా పూర్తి చేసినందుకు ఏపీని అభినందించారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఏపీతోపాటు ఝార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర అమలుచేసిన ఉత్తమ మల్టీచానల్ మార్కెటింగ్ నమూనాలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, గృహ, జీవనోపాధి రుణ పథకాలను దేశవ్యాప్తంగా అనుసరించేలా చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకం అమలులో ఏపీ, ఎంపీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు ఉత్తమ పనితీరు కనబరిచాయన్నారు. మణిపూర్, తెలంగాణ, మిజోరం, నాగాలాండ్ సహా పలు రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాల్లో పలు రోడ్లకు పర్యావరణ అనుమతులు కావాల్సి ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర పర్యావరణ మంత్రితో చర్చించేందుకు సిద్థంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే పూర్తి కాలేదన్నారు. ఆన్‌బోర్డ్ కావడం ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులో ఏపీ కర్ణాటక, కేరళ మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సారి తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 14 రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని 315 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉందని, వీటిలో 111 జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని హెచ్చరించారు. కేంద్ర వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఏపీ, తెలంగాణ, ఎంపీ, యూపీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, ఝార్ఖండ్, పంజాబ్, ఒడిశాలో వర్షాభావ పరిస్థితులున్నాయన్నారు.