Share News

నేతలు, అధికారుల పొదుపు మంత్రం

ABN , Publish Date - May 17 , 2026 | 05:34 AM

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.

నేతలు, అధికారుల పొదుపు మంత్రం

  • ఈ-బైక్‌పై మంత్రి పార్థసారథి పర్యటన

  • శ్రీనగర్‌లో ఎంపీ కలిశెట్టి సైకిల్‌ యాత్ర

  • పల్లె వెలుగు బస్సు ఎక్కిన ఎమ్మెల్యే మాధవి

  • సైకిల్‌ తొక్కిన మన్యం కలెక్టర్‌, జేసీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. కొందరు ఈ-బైక్‌, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారు. మరికొందరు సైకిల్‌ తొక్కి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. మంత్రి కొలుసు పార్థసారథి తన కాన్వాయ్‌లో ఒక్కటే వాహనం ఉండేలా చర్యలు తీసుకున్నారు. శనివారం ఎలక్ట్రికల్‌ కారులో విజయవాడ నుంచి ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్‌ను కూడా తన వాహనంలోనే తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్థానిక బాపునగర్‌లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలక్ట్రికల్‌ బైక్‌ను స్వయంగా నడుపుతూ వచ్చారు.


ఆర్టీసీ బస్సులో మహిళా ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పొదుపు మంత్రం పాటించారు. శనివారం గుంటూరు జీటీ రోడ్డులోని తన నివాసం నుంచి సత్తెనపల్లిలోని గుజ్జర్లపూడి గ్రామానికి వెళ్లేందుకు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ఎమ్మెల్యేతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఎమ్మెల్యే ఆధార్‌ కార్డు లేకుండా బస్సు ఎక్కడంతో టికెట్‌ తీసుకోవాల్సి వచ్చింది. గుజ్జర్లపూడి గ్రామంలో ఆమె దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Untitled-2 copy.jpg


5 కి.మీ. సైకిల్‌పై కలిశెట్టి

‘సేవ్‌ ఫ్యూయల్‌.. సేవ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అనే నినాదంతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జమ్మూ కశ్మీర్‌లో శనివారం సైకిల్‌ చైతన్య యాత్ర చేపట్టారు. ఐటీ, కమ్యూనికేషన్స్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీనగర్‌ వెళ్లిన ఆయన.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రాజ్‌ బాగ్‌ నుంచి యూరో బ్రిడ్జి వరకు సుమారు 5 కిలోమీటర్లు స్వయంగా సైకిల్‌ తొక్కి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో అందరూ ‘హ్యాట్సాఫ్‌.. అప్పలనాయుడు’ అంటూ అభినందనలు తెలిపారు. ఇంధన పొదుపు విషయంలో ఇంతకుముందే అప్పలనాయుడు ఆదర్శంగా నిలిచారు. రెండేళ్ల కిందట ఎంపీగా గెలిచిన ఆయన పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లారు. దానిని ఒక అలవాటుగా చేసుకున్నారు.

Untitled-2 copy.jpg


పార్వతీపురంలో సైకిల్‌ ర్యాలీ

స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం పట్టణంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో వైశాలి సైకిల్‌ తొక్కి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. పార్వతీపురం మున్సిపల్‌ పార్కు నుంచి పట్టణ ప్రధాన రహదారి వరకు సుమారు కిలోమీటరు మేర సైకిల్‌ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కరూ బైక్‌లకు బదులుగా సైకిళ్లు వినియోగించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ పిలుపునిచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పడు మాత్రమే వాహనాలు ఉపయోగించాలని కోరారు. ఎలక్ట్రికల్‌ వాహనాల వైపు మొగ్గు చూపాలన్నారు. ఇళ్లలో ఏసీలు, ఇతర విద్యుత్‌ పరికరాల వినియోగం కూడా తగ్గించాలని సూచించారు.

Untitled-2 copy.jpg

Updated Date - May 17 , 2026 | 05:44 AM