3 వేల గ్రామాలకు ‘జల్‌జీవన్ మిషన్’
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:55 AM
గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జల్‌జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్‌ను కంపెనీ చట్టం కింద స్థాపించింది.
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జల్‌జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్‌ను కంపెనీ చట్టం కింద స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల నాణ్యమైన తాగునీటిని కుళాయిల ద్వారా ఇళ్లకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులను కేంద్రం అమలు చేస్తున్న జల్‌జీవన్ మిషన్ కింద చేపడుతున్నారు. ఈ మిషన్ అమల్లో భాగంగా ప్రభుత్వం సుస్థిర ఉపరితల జలవనరులను వినియోగించేవిధంగా పథకాన్ని పునర్యవస్థీకరించింది. ఈ క్రమంలో రూ.9,161 కోట్లతో మంజూరైన 36,401 పాత పనులు రద్దయ్యాయి. సవరించిన తాజా ప్రణాళికలో 41,840 సింగిల్ విలేజ్ స్కీమ్స్, 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ మొత్తం వ్యయం రూ.17,663 కోట్లుగా నిర్ణయించారు. నీటి సరఫరా ఉన్న మూడు వేల గ్రామాల్లో తాగునీటి సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ పనులకు ప్రారంభంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌డీఎస్ గ్రాంట్ నుంచి నిధులు కేటాయించగా, భవిష్యత్తులో నాఫెడ్, ఎన్‌ఐడీఏ, సాస్కి, పూర్వోదయ పథకం లేదా జల్‌జీవన్ మిషన్ ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఈ పనులను ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్-ఇన్-చీఫ్, ఏపీ జల్‌జీవన్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ ఎండీకి అప్పగించారు. ఈ పనులకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
రూ.9,355 కోట్లతో ఏడు జిల్లాల్లో పథకాలకు నిధులు
జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ప్రభుత్వం రూ.9,355కోట్లతో ఏడు మల్టీ విలేజ్ పథకాలను మంజూరు చేసింది. కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఏలేరు రిజర్వాయర్ నుంచి మల్టీ విలేజ్ స్కీం కోసం రూ.3,691 కోట్లు, ఫేజ్-2 కింద చిత్తూరు జిల్లాకు గండికోట రిజర్వాయర్ నుంచి రూ.2,886 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు హిరమండలం రిజర్వాయర్ నుంచి రూ.1,204కోట్లతోను, అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.480 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గానికి రూ.390 కోట్లు, కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గానికి ఓక్ రిజర్వాయర్ నుంచి రూ.510కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కడియం, ఇతర ప్రాంతాలకు రూ.194 కోట్లతో పనులు మంజూరుచేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.