Share News

రక్తస్రావం, మూర్చతో మాతృ మరణాలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:45 AM

ప్రసవ సమయంలో మాతృ మరణాల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. స్వస్తి ఫెడరేషన్‌ ఆఫ్‌ అబెస్ట్రిక్‌ అండ్‌ గైనకాలజికల్‌..

రక్తస్రావం, మూర్చతో మాతృ మరణాలు

  • 43 శాతం కారణాలివే.. నివారణకు ప్రత్యేక శిక్షణ

  • తొలి విడతలో అనంతపురం, బాపట్ల జిల్లాల వారికి

అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రసవ సమయంలో మాతృ మరణాల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. స్వస్తి ఫెడరేషన్‌ ఆఫ్‌ అబెస్ట్రిక్‌ అండ్‌ గైనకాలజికల్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా(ఫాగ్సీ) సాంకేతిక సహకారంతో ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయిలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమాల్లో గైనకాలజిస్టులు, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తొలి విడతలో అనంతపురం, బాపట్ల జిల్లాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. గర్భిణుల ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, అధిక రక్తపోటు వల్ల మూర్చ వంటి సమస్యలు తలెత్తకుండా అధునాతన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు శిక్షణ తీసుకున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న మాతృ మరణాలకు ఎక్కువగా అధిక రక్తస్రావం, అధిక రక్తపోటు వల్ల వచ్చే మూర్చ వంటివి కారణాలు. ప్రసవ సమయంలో వంద మంది మరణిస్తే ఈ కారణాలతో మరణించేవారు అత్యధికంగా 43 శాతం మంది ఉంటున్నారు. ఇందులో అధిక రక్తస్రావంతో 20 శాతం మంది, మూర్చతో 23 శాతం మంది మరణిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఈ తరహా మరణాలను తగ్గించే చర్యల్లో భాగంగా ఆరోగ్యశాఖ, ఫాగ్సీ సహకారంతో అధిక రక్తస్రావం సమస్యను త్వరగా గుర్తించడం, గర్భాశయాన్ని మసాజ్‌ చేయడం, ఆక్సిటోసిన్‌, ట్రానెక్సామిక్‌ మందులు, ఐవీ ద్రవాలు ఇవ్వడం, నిశిత పరిశీలన ద్వారా అవసరమైన చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి సవివరంగా తెలియజేశారు. ప్రస్తుత విధానంలో అధిక రక్తస్రావాన్ని గుర్తించడంలో, సమయానికి పెద్దాసుపత్రులకు తరలించడంలో, తరలించేముందు గర్భిణులకు చికిత్స విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎన్జీవో జాతీయ అధ్యక్షురాలు డా.మాధురి, ఏపీ చాప్టర్‌ ముఖ్య ప్రతినిధి డా.సుశీల వివరించారు.

Updated Date - Jul 03 , 2026 | 05:45 AM