Share News

మన బడికి.. మన విరాళం!

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:55 AM

చదువుకున్న బడికి విరాళం ఇవ్వాలనుకుంటున్నారా? సుదూరంలో ఉన్నామని మథనపడుతున్నారా? ఇంత చిన్నమొత్తంలో విరాళం ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? ఇక అలాంటి చింతలేవీ పెట్టుకోనవసరం లేదు.

మన బడికి.. మన విరాళం!

  • పాఠశాలల అభివృద్ధికి త్వరలో డొనేషన్‌ యాప్‌

  • ప్రతి పాఠశాల అవసరాలు యాప్‌లో చూడొచ్చు

  • ఎంత చిన్న మొత్తమైనా విరాళంగా ఇచ్చే అవకాశం

  • వస్తువులు నేరుగా స్కూల్‌కే డెలివరీ చేయొచ్చు

  • 82 రకాల అవసరాలు ఉన్నట్లు అంచనా

  • మొత్తం రూ.6 వేల కోట్లకు పైగా అవసరం

  • తరగతి గదులకు దాతల పేర్లు పెట్టే ప్రతిపాదన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చదువుకున్న బడికి విరాళం ఇవ్వాలనుకుంటున్నారా? సుదూరంలో ఉన్నామని మథనపడుతున్నారా? ఇంత చిన్నమొత్తంలో విరాళం ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? ఇక అలాంటి చింతలేవీ పెట్టుకోనవసరం లేదు. ఆ బడికి వెళ్లనవసరం కూడా లేదు. ‘స్కూల్‌ డొనేషన్‌ యాప్‌’ మీకు తోడుగా ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ రూపొందిస్తున్న ఈ యాప్‌లోకి వెళ్లి ఆ బడికి ఏం అవసరమో వాటిని విరాళంగా అందజేయవచ్చు. వాటిని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో బుక్‌ చేసి నేరుగా పాఠశాలకే పంపొచ్చు. లేదంటే మీకు నచ్చినంత ఆ యాప్‌ ద్వారానే విరాళంగానూ ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో ఈ యాప్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించనున్నారు.


యాప్‌లోనే మొత్తం అవసరాలు

సాధారణంగా పూర్వ విద్యార్థులు, దాతలు పాఠశాలలకు విరాళాలు ఇవ్వాలంటే ఆ బడులకు వెళ్లాలి. అయితే ఏ బడికి ఏం కావాలో తెలుసుకోవడానికే బడి వరకూ వెళ్లాలంటే సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారికి సాధ్యం కాదు. కొందరు చిన్న మొత్తాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నా అంత చిన్న మొత్తం ఇస్తే బాగుండదులే అనే ఆలోచనతో అక్కడే ఆగిపోతుంటారు. విదేశాల్లో స్థిరపడినవారికీ పాఠశాలలకు విరాళం ఇవ్వడం కష్టంగా మారింది. అందుకే ప్రభుత్వ పాఠశాలలకు సులభంగా విరాళాలు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ యాప్‌ తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు 45వేలు ఉన్నాయి. జిల్లాలు, మండలాల వారీగా ఎంపిక చేసుకుని ఏ పాఠశాలకు ఏం కావాలో యాప్‌లో చూడొచ్చు. పాఠశాల విద్యాశాఖలో స్కూల్‌ ఇన్‌ఫ్రా విభాగం బడులకు ఏం కావాలనే అంచనాలు యాప్‌లో పొందుపరుస్తుంది. నిర్మాణ, ఇతర అవసరాలు మొత్తం 82 రకాలు ఉన్నాయి. ఆ బడికి ఏం కావాలో చెక్‌ లిస్ట్‌ ఉంటుంది. దాతలు వాటిని ఎంపిక చేసుకుంటే అందుకోసం ఏ మేరకు నిధులు అవసరమో అక్కడ చూపిస్తుంది. ఆ మేరకు విరాళాన్ని అక్కడే పేమెంట్‌ గేట్‌వే ద్వారా ఇవ్వొచ్చు. లేదా కనీస మొత్తం రూ.15 నుంచి మనకు నచ్చినంత విరాళం పంపొచ్చు. లేదంటే చెక్‌ లిస్టులో ఉన్న అవసరాల్లో ఏదైనా వస్తువు ఆన్‌లైన్‌ ఈకామర్స్‌లో అందుబాటులో ఉంటే పాఠశాల అడ్రస్‌ ఇచ్చి నేరుగా పాఠశాలకు పంపొచ్చు. అలా వస్తువులు పంపితే వాటిని ఎలా వినియోగించారనే ఫొటోలను ఆ యాప్‌లోనే అప్‌లోడ్‌ చేస్తారు. అలాగే దాతలకు వ్యక్తిగతంగానూ ఫొటోలు పంపుతారు. ఒకవేళ దాతలు నేరుగా పాఠశాలలకు వెళ్లి విరాళాలు ఇస్తే ఆ వివరాలను అక్కడి హెచ్‌ఎం యాప్‌లో నమోదుచేస్తారు. అలాగే అదనపు తరగతి గదులు నిర్మించేందుకు విరాళాలు ఇచ్చేవారి పేర్లను ఆ గదులకు పెట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది.


రూ.6వేల కోట్లకుపైగా అవసరం

ప్రస్తుతం 45వేల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఉన్న అవసరాలను అంచనా వేయగా రూ.6వేల కోట్లకు పైగా నిధులు అవసరమని తేలింది. ఎక్కువగా అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, కంప్యూటర్లు అవసరాలు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. మరోవైపు కనీస అవసరాలకు రూ.1792 కోట్లు అవసరం అని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ త్వరలో ఆ పనులు చేపట్టనుంది. దాతల ద్వారా వచ్చే విరాళాలతోనూ పనులు చేపట్టనుంది.

ప్రతి పాఠశాలకూ విడిగా చెక్‌లిస్టు

ఇటీవల నెల్లూరులో ఒక ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఓ ట్రస్టు రూ.5 కోట్ల విరాళం ఇచ్చింది. వాటిని ఆయా పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తారు. అయితే కొత్త యాప్‌లో ఫలానా పాఠశాలకు ఏం అవసరం అనే వివరాలు వేర్వేరుగా చూసుకోవచ్చు. ఆ అవసరాలను చూసి అందులో మనకు నచ్చిన వాటిని విరాళంగా ఇవ్వొచ్చు. ఆ పాఠశాలలో మొత్తం ఎన్ని అవసరాలున్నాయి? వాటి మొత్తం విలువ ఎంత? అనేది యాప్‌లో కనిపిస్తుంది. మనం విరాళం ఇచ్చాక ఆ మొత్తం విలువ తగ్గుతుంది. లేదా మనం అవసరం ఉన్న వస్తువులను డెలివరీ చేసినా పాఠశాల అవసరాల నుంచి దానిని తొలగిస్తారు. దీనివల్ల పాఠశాలకు ఏదొకటి ఇద్దాం అని కాకుండా ఏది అవసరమో దానినే విరాళంగా ఇచ్చే అవకాశం దాతలకు ఏర్పడుతుంది.

Updated Date - Mar 17 , 2026 | 04:56 AM