Share News

పొలం చెంతకు పైప్‌ లైన్లతో నీరు

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:44 AM

సాగునీటి సరఫరా కోసం భారీగా కాలువలను తవ్వి వాటి ద్వారా నీటిని తరలించడం వ్యయంతో కూడుకున్నదిగా కేంద్ర జలశక్తి శాఖ భావిస్తోంది. కాలువల తవ్వకం కోసం భూసేకరణ సవాల్‌గా మారింది.

పొలం చెంతకు పైప్‌ లైన్లతో నీరు

  • కాలువలకు స్వస్తి చెప్పనున్న కేంద్రం!

  • కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో ‘ఎంకాడ్‌’ పథకం.. మన్యంలో పైలట్‌

  • పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): సాగునీటి సరఫరా కోసం భారీగా కాలువలను తవ్వి వాటి ద్వారా నీటిని తరలించడం వ్యయంతో కూడుకున్నదిగా కేంద్ర జలశక్తి శాఖ భావిస్తోంది. కాలువల తవ్వకం కోసం భూసేకరణ సవాల్‌గా మారింది. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు కాలువల ద్వారా నీటిని తరలించేందుకు యేటా పూడికతీత, గర్రపు డెక్క తొలగింపునకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌(ఎం-కాడ్‌) పథకం కింద పైపులైన్ల ద్వారా పొలాల వద్దకు నీటిని తరలించే పథకాన్ని అమలు చేయాలని జలశక్తి శాఖ నిర్ణయించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలి. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దగెడ్డ రిజర్యాయరు కింద పాచిపెంట మండలంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా మండలంలోని 12వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ప్రతి రైతుకూ హెక్టారు పొలం దాకా నీరందిస్తారు. పొలాలకు నీటిని పంపింగ్‌ చేసేందుకు అవసరమైన సోలార్‌ ప్యానళ్లను బిగించేందుకు ఆ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. పెద్దగెడ్డ పరిధిలోని 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 72 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.60 కోట్లదాకా పైపు లైన్ల నిర్మాణానికి ఖర్చవుతుందని అంచనా. మిగిలిన రూ.12కోట్లు పర్యవేక్షణ వ్యయాల కింద ఖర్చు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తర కోస్తా జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీరు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. కాగా, ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో పైపులు తదితర ముడిసరుకుల ధరలు పెరిగాయి. డీపీఆర్‌లో అంచనాలను పెంచుకునే వెసులుబాటును కేంద్ర జలశక్తి శాఖ కల్పించలేదు. దీంతో జల వనరుల శాఖ తయారు చేసిన డీపీఆర్‌ మేరకు పనులు చేసేందుకు కాంట్రాక్టు సంస్థలు ముందుకు రావడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ పథకం విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ యోచిస్తోంది.

Updated Date - Apr 25 , 2026 | 04:47 AM