డిగ్రీ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:30 AM
ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు ఏడాదిపాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు ఏడాదిపాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. జాతీయస్థాయిలో సెక్టార్ స్కిల్ కౌన్సిళ్ల ప్రతినిధులతో శుక్రవారం మంగళగిరిలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. త్వరలో ఈ కౌన్సిళ్లతో ఒప్పందాలు చేసుకోనుంది. ఎంబెడెడ్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. మూడేళ్ల డిగ్రీ కోర్సులో రెండేళ్లపాటు రెగ్యులర్ బోధన ఉంటుంది. మూడో సంవత్సరం పూర్తిగా ఇంటర్న్‌షి్‌పకు వెళ్తారు. స్కిల్ కౌన్సిళ్లు సూచించే పరిశ్రమల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేస్తారు. నెలకు రూ.6900 నుంచి రూ.15 వేల వరకు విద్యార్థులకు పరిశ్రమలు చెల్లిస్తాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, వాటికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో కొత్త కోర్సులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రాంతీయ, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ విద్యార్థుల్లో నైపుణ్యం, విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు.