చిన్నారుల అభివృద్ధికి ‘నవచేతన’
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:04 AM
ప్రతి చిన్నారి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నవచేతన’ పేరుతో బాల్యారంభ అభివృద్ధి (ఎర్లీ చైల్డ్ హుడ్ డెవల్‌పమెంట్)...
రాష్ట్రవ్యాప్తంగా ఈసీడీ కార్యక్రమం: మంత్రి సంధ్యారాణి
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ప్రతి చిన్నారి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నవచేతన’ పేరుతో బాల్యారంభ అభివృద్ధి (ఎర్లీ చైల్డ్ హుడ్ డెవల్‌పమెంట్) ఈసీడీ స్ర్కీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గురువారం ఈమేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే తొలి వెయ్యి రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. పిల్లల మెదడు అభివృద్ధిలో 80 శాతం మూడేళ్లలోపు, 90 శాతం ఆరేళ్లలోపు పూర్తవుతుంది. ప్రారంభ సంవత్సరాల్లో అందే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, స్పందనాత్మక సంరక్షణ, ప్రారంభ అభ్యసన అవకాశాలు, భద్రత, పిల్లల భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం, ఉత్పాదకత, శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. బాలల అభివృద్ధిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి సకాలంలో జోక్యం చేసుకునేందుకు మహిళా..శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో ‘నవచేతన’ అనే మొబైల్ ఆధారిత అభివృద్ధి స్ర్కీనింగ్ సాధనాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి’ అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణను మే 29,30 తేదీల్లో నిర్వహిస్తామని, అంగన్వాడీ కార్యకర్తలకు జూన్ 5 నుంచి 10 వరకు భారీస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.