భూ రికార్డులకు సాంకేతిక రక్ష!
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:42 AM
భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని..
ఒకే వేదికపైకి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సమాచారం
భూ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ వ్యవస్థ
తొలుత ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
నేడు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభం
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా నిలిచే ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ వ్యవస్థను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరగనుంది. మొదటి దశలో ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది అమలు కానుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటం వల్ల డేటా వ్యత్యాసాలు, రికార్డుల్లో మార్పులను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థను రూపొందించారు. ఇకపై ఏ అధికారి, ఎప్పుడు లావాదేవీలు నిర్వహించారనే వివరాలు కూడా శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి.