పశుపోషకులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:14 AM
రైతులకు ఇస్తున్నట్టే.. పశుపోషకులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు చెప్పారు.
అమరావతి, విజయవాడ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రైతులకు ఇస్తున్నట్టే.. పశుపోషకులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు చెప్పారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని సోమవారం ఆయన తెలిపారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డులు పొందటానికి రాష్ట్రంలో సొంత లేదా కౌలు భూమి కలిగిన పశు పోషకులు, స్వయంసహాయక సంఘాల సభ్యులు అర్హులు. పశువుల సంఖ్యను బట్టి నియమ నిబంధనల మేరకు గరిష్ఠంగా రూ.3లక్షల వరకు రుణం పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా 7శాతం వడ్డీతో రుణం పొందవచ్చు. ఏడాదిలోపు రుణం తిరిగి చెల్లిస్తే.. 3శాతం వడ్డీ రాయితీని తిరిగి పొందవచ్చు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఐదు చొప్పున పశు వసతి గృహాలు నిర్మించనున్నట్టు దామోదర్‌నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2027 మార్చి 31 నాటికి ఈ గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.