Share News

లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:18 AM

వీబీ-జీరామ్‌జీ పథకంలో రాష్ట్రంలోని లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలు సుస్థిర ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని..

లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు

  • వీబీ-జీరామ్‌జీ నిధులతో పేదలకు ప్రయోజనం

  • ఒక్కో రైతుకు 2.50 ఎకరాలకు అనుమతి

  • అన్ని రకాల పండ్ల మొక్కలు పెంచుకునే అవకాశం

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): వీబీ-జీరామ్‌జీ పథకంలో రాష్ట్రంలోని లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలు సుస్థిర ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద రైతులు ఉద్యాన పంటలు వేసుకునేందుకు పనులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఇప్పటికే కలెక్టర్లకు కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద పేద రైతులకు ఉద్యాన తోటల పెంపకానికి అవకాశం కల్పిస్తారు. మామిడి, జీడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, దానిమ్మ, సీతాఫలం, అవకాడో, అంజీర్‌, పనస, డ్రాగన్‌ఫ్రూట్‌, నేరేడు, చింత వంటి పండ్ల తోటలతోపాటు గులాబీ, మల్లె పూల తోటలకు కూడా అనుమతి ఇచ్చారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌, కోకో, రబ్బరు, జాఫ్రా, మునగ, వెదురు, సిల్వర్‌ ఓక్‌ వంటి వాణిజ్య పంటలను కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రోత్సహిస్తారు.

ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యం

ఎస్సీ, ఎస్టీలు, మహిళా యాజమాన్య కుటుంబాలు, దివ్యాంగుల కుటుంబాలు, భూసంస్కరణల లబ్ధిదారులు, పీఎంఏవై గ్రామీణ లబ్ధిదారులు, అటవీ హక్కుల చట్టం కింద లబ్ధిపొందిన కుటుంబాలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యం ఇస్తారు. అనంతరం చిన్న, సన్నకారు రైతులను ఎంపిక చేస్తారు. గ్రామసభ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించి పంచాయతీ ఆమోదం పొందుతారు. గతంలో గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు అనుమతించగా, తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో కుటుంబానికి 0.25 నుంచి 2.50 ఎకరాల వరకు అనుమతిస్తారు. ఒక్కో రైతు 4 లక్షల వరకూ లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉద్యాన, వ్యవసాయ శాఖలతో సమన్వయం చేసుకుని అంచనాలు, పనులు చేపట్టాలని సూచించారు.


ఇప్పటికే ప్రారంభమైన ప్రక్రియ

ఈ కార్యక్రమం కింద ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, భూమి వివరాలు నమోదు చేసిన క్షేత్రస్థాయి సిబ్బంది, పనుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నెల 20వ తేదీ నాటికి కనీసం 30 వేల ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకునేలా పనులు మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఆయా జిల్లాల్లో వర్షాల సీజన్‌ బట్టి అంచెలంచెలుగా ఏడాది లోపు లక్ష ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టనున్నారు. అక్టోబరు నెలాఖరు దాకా ఉద్యాన పంటల పనులు మంజూరు చేయాలని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రతి ఏటా ఉపాధి హామీ పథకంలో ఈ పనులు చేపడుతున్నప్పటికీ.. కొత్తగా వచ్చిన వీబీజీరామ్‌జీ పథకంలో ఈ పనులు ఉన్నాయో? లేవోనన్న సందేహంలో ఉన్న రైతులకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి సందేహాన్ని నివృత్తి చేసింది.


ఉచితంగా మూడేళ్లపాటు నిర్వహణ వ్యయం

వీబీజీరామ్‌జీ పథకం ద్వారా పేద రైతులకు ఉచిత ఆర్థిక సాయం మూడేళ్లపాటు అందుతుంది. 2.50 ఎకరాల్లో పంట సాగు చేసే ఒక్కో రైతు రూ.4 లక్షల దాకా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. రైతులకు ఈ ఉద్యాన పంటలు మంజూరు చేయడం ద్వారా వీబీజీరామ్‌జీ పథకం కొత్తగా అందించే 125 పని దినాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక ఎకరాలో మామిడి తోట పెంచుకోవాలన్న రైతుకు 70 మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తారు. వాటిని పెంచేందుకు మొదటి సంవత్సరం రూ.51,272, రెండో ఏడాది రూ.27,914, మూడో సంవత్సరం రూ.30,398 అందిస్తారు. మొత్తం మూడేళ్లలో రూ.1,09,584లు సాయం అందిస్తారు. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత గత రెండేళ్లలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా 1.57 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేశారు. ఇందుకు అవసరమైన నిధులన్నీ ఇంతవరకూ ఉపాధి పథకం ద్వారా అందగా.. ఇకపై వీబీజీరామ్‌జీ ద్వారా అందిస్తారు.

Updated Date - Jun 19 , 2026 | 04:20 AM