నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘హనుమాన్’
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:41 AM
రాష్ట్రంలోని వన్యప్రాణులను పర్యవేక్షిస్తూ, వాటికి వైద్యం, పోషణ అందించడంతో పాటు ఏనుగుల గుంపుల దాడులతో జరిగే పంటల నష్టాన్ని నివారించే లక్ష్యంతో అటవీ శాఖ రూపొందించిన....
పూర్తిస్థాయి ప్రాజెక్టు అమలును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్
కార్యక్రమానికి మంత్రి లోకేశ్ అధ్యక్షత
వన్యప్రాణుల పర్యవేక్షణ, పోషణే లక్ష్యం
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వన్యప్రాణులను పర్యవేక్షిస్తూ, వాటికి వైద్యం, పోషణ అందించడంతో పాటు ఏనుగుల గుంపుల దాడులతో జరిగే పంటల నష్టాన్ని నివారించే లక్ష్యంతో అటవీ శాఖ రూపొందించిన ‘హనుమాన్’ ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు కానుంది. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీ స్పెషల్ పోలీస్(6వ బెటాలియన్) పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. హనుమాన్(హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్) ప్రాజెక్టును ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కృత్రిమ మేధ సాయంతో నిర్వహించే ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు, ముఖ్యంగా ఏనుగుల వల్ల ఉత్పన్నమవుతున్న నష్టాలను నివారించేందుకు అటవీ శాఖ ‘హనుమాన్’ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. దీనికి ప్రభుత్వం పాలక మండలిని ఏర్పాటు చేసింది. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చైర్మన్‌గా, వివిధ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఎన్జీవోలను సభ్యులుగా నియమించింది.
పెరిగిన మానవ-వన్యప్రాణుల సంఘర్షణలు
వైవిధ్య భరితమైన ప్రకృతి, అడవులు, వన్యప్రాణులు, జీవివైవిధ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఏనుగులు, పాపికొండ ప్రాంతంలో పులులు, రాష్ట్రవ్యాప్తంగా చిరుతలు, అడవి పందులు, పాములు, కోతులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణ జింకలు, అటవీ సరిహద్దుల్లో చుక్కల జింకలు ఉన్నాయి. ఈ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణలు పెరిగాయి. ముఖ్యంగా ఏనుగుల గుంపుల దాడులతో పంటలు, ఆవాసాలు ధ్వంసమవుతుండగా, మూగజీవాలతో పాటు మనుషులూ చనిపోతున్నారు. గత దశాబ్దంలో సంఘర్షణల కారణంగా పదుల సంఖ్యలో మనుషులు, వందల సంఖ్యలో జంతువులు చనిపోయిన నేపథ్యంలో వన్యప్రాణుల పర్యవేక్షణకు, మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణల్ని అధిగమించేందుకు పవన్ కల్యాణ్ చొరవతో అటవీశాఖ హనుమాన్ ఫౌండేషన్‌కు రూపకల్పన చేసింది. ఏనుగులతో సహా అటవీ జంతువులను గుర్తించడానికి, అధికారులకు రియల్ టైమ్‌లో హెచ్చరికలు పంపడానికి ఏఐ, సౌరశక్తి సాయంతో నడిచే వ్యవస్థలను ఉపయోగిస్తారు.