గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక పెట్ స్కాన్
ABN , Publish Date - May 14 , 2026 | 05:26 AM
రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్(పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) సేవలు గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమయ్యాయి.
18 కోట్లతో అమెరికా నుంచి దిగుమతి
ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే తొలిసారి
నేడు ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్
గుంటూరు మెడికల్, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్(పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) సేవలు గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమయ్యాయి. పేద, మధ్య తరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి అత్యుత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వాస్పత్రుల్లో తొలిసారిగా జీజీహెచ్‌లో ఈ యంత్రాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. క్యాన్సర్ వైద్యంలో ఇదొక మైలురాయి కాబోతుంది. ఇందు కోసం సుమారు రూ.18 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేసింది. ట్రయల్ రన్ విధానంలో దీని పని తీరును అధికారులు నిశితంగా పరిశీలించారు. ఇప్పటి వరకు 50 మంది రోగులను పరీక్షించారు. పెట్ స్కాన్ సేవలను మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ప్రారంభించనున్నారు.
నాట్కో క్యాన్సర్ కేంద్రంలో...
ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేటు ఆస్పత్రుల్లో పెట్ స్కాన్ సదుపాయం అందుబాటులో ఉంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ పరీక్షకు రూ.25 వేలవరకూ తీసుకుంటున్నారు. నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో పెట్ స్కాన్ పరీక్షలు ఉచితంగా చేస్తారు. లెవల్-1 స్థాయిలో ఈ కేన్సర్ సెంటర్‌ను తీర్చిదిద్దేందుకు ఇప్పటికే లినాక్, హెచ్‌ఏఆర్ బ్రాకీథెరఫీ, సీటీ స్టిమ్యులేటర్ వంటి అత్యాధునిక సర్జికల్ పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ కేంద్రంలో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్, మెడికల్, న్యూక్లియర్, ప్రివెంటివ్ అంకాలజీ, పెయిన్, పాలియేటివ్ కేర్ సేవలు ప్రారంభమయ్యాయి.
సూపర్ స్పెషాలిటీ సేవల అవసరాలకు....
రాష్ట్ర విభజన అనంతరం క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని నాట్కో ట్రస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.15 కోట్లతో గుంటూరు జీజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాన్ని నాలుగున్నరేళ్ల కిందట నిర్మించింది. క్యాన్సర్ వైద్య సేవల నిమిత్తం అవసరమైన వైద్యులు, సాంకేతిక నిపుణులు, పారా మెడికల్, ఇతర సిబ్బందిని కూటమి ప్రభుత్వం నియమించింది. గడిచిన ఏడాదిలో ఓపీ ద్వారా 19,598 మంది రోగులు, ఐపీ ద్వారా 6942 మంది రోగులు చికిత్స పొందారు. 3,363 మంది కీమోథెరపీ, 965 మంది రేడియేషన్ థెరపీ చేయించుకున్నారు. 1131 మందికి క్యాన్సర్ సర్జరీలు జరిగాయి.