Share News

కృష్ణా, కాకినాడ జిల్లాల్లో యాప్‌తో ఎరువులు

ABN , Publish Date - May 22 , 2026 | 04:59 AM

ఏపీఎయిమ్స్‌ 2.0 యాప్‌ ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేసే కార్యక్రమానికి కృష్ణా, కాకినాడ జిల్లాలు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంకయ్యాయి.

కృష్ణా, కాకినాడ జిల్లాల్లో యాప్‌తో ఎరువులు

  • పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక

అమరావతి, మే21(ఆంధ్రజ్యోతి): ఏపీఎయిమ్స్‌ 2.0 యాప్‌ ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేసే కార్యక్రమానికి కృష్ణా, కాకినాడ జిల్లాలు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంకయ్యాయి. జాతీయ స్థాయిలో రూపొందించిన ఐఎఫ్ఎంఎస్‌ పోర్టల్‌కు అనుసంధానం చేసిన ఈ యాప్‌ ద్వారా ఎరువుల సరఫరా విధానాన్ని ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. రైతు విశిష్ఠ సంఖ్య, ఫార్మర్‌ ఐడీలను కూడా ఈ యాప్‌కు అనుసంధానం చేసి, సరఫరా చేపట్టనున్నారు. ఈ యాప్‌ విధానంలో కొన్ని స్థానిక పరిమితుల అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో దీనిపై గురువారం మంగళగిరిలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయంలో సన్నద్ధ సమావేశం జరిగింది. యాప్‌ అమలుకు ప్రత్యేక సవరింపులు, రైతాంగానికి అనుకూలమైన మార్పుల కోసం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీతో కలిసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ అధికారుల సూచనలు తీసుకున్నారు. ఎక్కువ మంది రైతులకు యాప్‌ ద్వారా ఎరువులు అందించేలా అధికారులు కొన్ని సవరణలను ప్రతిపాదించారు. రైతులకు ఐచ్చికంగా పంట దశను బట్టి దఫదఫాలుగా ఎరువులు అందజేయాలని, వాస్తవ సాగుదారుడిని గుర్తించే విషయంలో గ్రామ వ్యవసాయ సహాయకుడిపై బాధ్యత పెట్టాలని, కృత్రిమ మేధను ఉపయోగించి, విస్తృత తనిఖీలకు ఆస్కారం ఉండేలా చూడాలని సూచనలు చేశారు. ఈ సూచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని రాజశేఖర్‌ తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 05:00 AM