మందుల గడువు తీరితే ‘అలర్ట్’
ABN , Publish Date - May 23 , 2026 | 05:56 AM
గడువు ముగిసిన మందుల్లో రసాయన ప్రభావం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యాధి నయం కాకపోగా.. కొన్ని సందర్భాల్లో అవి విషపూరితంగా మారి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి.
‘ఈ-ఔషధి’ సాఫ్ట్‌వేర్‌లో కొత్తగా అలర్ట్ విధానం
మందుల కార్పొరేషన్‌లో ‘సీ-డాక్’ ప్రత్యేక శిక్షణ
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): గడువు ముగిసిన మందుల్లో రసాయన ప్రభావం తగ్గిపోతుంది. దీనివల్ల వ్యాధి నయం కాకపోగా.. కొన్ని సందర్భాల్లో అవి విషపూరితంగా మారి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఇచ్చే మందులను నిర్ణీత గడువులోగా ఉపయోగించే విధంగా ‘ఈ-ఔషధి’లో అలర్ట్ విధానాన్ని తీసుకురానుంది. దీనికోసం ‘ఈ-ఔషధి’ యాప్ సాఫ్ట్‌వేర్‌లో తీసుకురానున్న మార్పులపై ఢిల్లీ నుంచి వచ్చిన ‘సీ-డాక్’ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ల పర్యవేక్షణ అధికారులు, సీనియర్ ఫార్మసిస్టులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వాస్పత్రుల్లో మందుల విషయంలో జరిగే ప్రతి ప్రక్రియా ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా పర్యవేక్షణ అధికారులకు సంక్లిష్త సందేశాల రూపంలో అలర్ట్‌లు వెళ్లే విధంగా త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా మందులు, సర్జికల్ కొనుగోళ్ల కోసం రూ.800 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన మందులను రోగులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేస్తోంది. అయితే ఈ మందుల సరఫరా, వినియోగం, కాల వ్యవధి గుర్తింపు వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఈ-ఔషధి’ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఏపీ అధికారులు, ఫార్మసిస్టులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.