Share News

పట్టణ నీటి వనరులపై డిజిటల్‌ నిఘా

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:19 AM

రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగువేసింది. పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు, సమర్థవంతమైన..

పట్టణ నీటి వనరులపై డిజిటల్‌ నిఘా

  • 123 పట్టణాల్లో 800 నీటి ప్రాజెక్టులు

  • ప్రాజెక్టులన్నింటికీ ఒకే డిజిటల్‌ వేదిక

  • రూ.19,561 కోట్ల పనులకు ప్రత్యేకంగా రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ ఏర్పాటు

  • ఫొటో ఆధారాలతో పనుల నమోదు

  • వారంలో బిల్లుల చెల్లింపునకు శ్రీకారం

  • అడ్డంకులకు వెనువెంటనే పరిష్కారం

  • మున్సిపల్‌శాఖ ‘ఓడబ్ల్యూఎంఎస్‌’ విధానం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగువేసింది. పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు, సమర్థవంతమైన మురుగునీటి నిర్వహణ కోసం మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ డిజిటల్‌ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తోంది. 123 పట్టణ స్థానికసంస్థల్లో అమలవుతున్న 800లకు పైగా తాగునీరు, మురుగునీటి ప్రాజెక్టులను ఒకే డిజిటల్‌ వేదికపై తీసుకువచ్చి, రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేలా ఆన్‌లైన్‌ వర్క్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఓడబ్ల్యూఎంఎ్‌స)ను రూపొందించింది. సుమారు రూ.19,561 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల్లో ఏ పని ఎక్కడ నిలిచింది?, ఏ అనుమతి పెండింగ్‌లో ఉంది?, ఏ అఽధికారి బాధ్యత వహిస్తున్నారు?, బిల్లుల చెల్లింపులు ఏ దశలో ఉన్నాయి.. వంటి ప్రతి అంశం ఈ వ్యవస్థ ద్వారా తక్షణమే తెలుసుకునే అవకాశం కల్పించింది. ఫీల్డ్‌ ఇంజనీర్లు మొబైల్‌ యాప్‌ ద్వారా ఫొటో ఆధారాలతో పనుల పురోగతిని నమోదు చేయడం, ఉన్నతాధికారులు వాటిని ధృవీకరించడం, అడ్డంకులను వెంటనే గుర్తించి పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టలు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో పట్టణ నీటి మౌలిక వసతుల నిర్వహణకు డిజటల్‌ సాంకేతికను సమగ్రంగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇది కేవలం పనుల పురోగతిని చూపించే డ్యాష్‌బోర్డు మాత్రమే కాకుండా సమస్యలను గుర్తించి పరిష్కరించే పరిపాలనా వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంది. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌. సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం కల్పించారు. ప్రాజెక్టుల అమలు, అనుమతులు, ఫీల్డ్‌స్థాయి పనులు, బిల్లుల చెల్లింపులు, అడ్డంకులు అన్నీ ఒకే వేదికపై కనిపించనున్నాయి.


పెరుగుతున్న నీటి అవసరాలు

రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు 1.73 కోట్ల మంది ప్రజలు నివశిస్తున్నారు. 2029 నాటికి ఈ సంఖ్య 1.90 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరం కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు రోజుకు అవసరమైన నీటి పరిమాణం 2,860 మిలియన్‌ లీటర్లు(ఎంఎల్‌డీ) కాగా, అందుబాటులో ఉన్నది 2,098 ఎంఎల్‌డీలు మాత్రమే. అంటే, 762 ఎంఎల్‌డీల లోటు కొనసాగుతోంది. ప్రస్తుతం 19 పట్టణాల్లో మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తికి రోజుకు 135 లీటర్ల ప్రమాణానికి మించి నీరు అందుతోంది. 71 పట్టణాల్లో 70 నుంచి 135 లీటర్ల మధ్య, 33 పట్టణాల్లో 70 లీటర్ల కంటే తక్కువ నీటి సరఫరా జరుగుతోంది. 27 పట్టణాల్లో రోజుకు రెండు సార్లు నీరు అందుతుంటే, 51 పట్టణాల్లో రోజుకు ఒక్కసారి, 38 పట్టణాల్లో రెండు రోజులకొకసారి, 7 పట్టణాల్లో మూడు రోజులకొకసారి లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో నీరు సరఫరా అవుతోంది. మరోవైపు, మురుగునీటి శుద్ధి కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. రాష్ట్రంలోని పట్టణాల్లో రోజుకు 2,147 ఎంఎల్‌డీ మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, ప్రస్తుతం ఉన్న ఎస్టీపీల సామర్థ్యం కేవలం 711 ఎంఎల్‌డీలు మాత్రమే. మురుగుకాల్వల నెట్‌వర్క్‌ కూడా తక్కువగా ఉంది. 22 వేల కిలో మీటర్లకు పైగా నెట్‌వర్క్‌ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 3,219 కిలో మీటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


లోపాలను గుర్తించేందుకు ఓడబ్ల్యూఎంఎస్‌

తాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంపింగ్‌, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, ట్రాన్స్‌మిషన్‌ పైప్‌లైన్‌, రిజర్వాయర్‌, పంపిణీ నెట్‌వర్క్‌, ఇంటింటికీ కనెక్షన్లు వంటి అన్ని భాగాలు పూర్తయితేనే ప్రజలకు నీరు అందుతుంది. ఉదాహరణకు 95 శాతం పనులు పూర్తయినా, రైల్వే ట్రాక్‌ లేదా జాతీయ రహదారి దాటే పైప్‌లైన్‌కు అనుమతి రాకపోతే మొత్తం ప్రాజెక్టు నిరుపయోగంగా మారుతుంది. ఇలాంటి సమస్యలను గుర్తించేందుకే ఓడబ్ల్యూఎంఎస్‌ రూపొందించారు. ఈ వ్యవస్థలో ప్రతి ప్రాజెక్టును చిన్న భాగాలుగా విభజించి పర్యవేక్షిస్తారు. వాటర్‌ సోర్స్‌, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పైప్‌లైన్‌, రిజర్వాయర్‌, పంపిణీ వ్యవస్థ, ఇంటింటికీ కనెక్షన్లు, ఎస్టీపీ, మురుగు నీటి నెట్‌వర్క్‌ వంటి ప్రతి అంశం పురోగతిని విడివిడిగా నమోదు చేస్తారు. దీంతో ఏ భాగం పూర్తయింది, ఏ భాగం పెండింగ్‌లో ఉంది, ఏ కారణంతో ఆలస్యం జరుగుతోందో అధికారులు వెంటనే తెలుసుకునే అవకాశముంటుంది. ఫీల్డ్‌ ఇంజనీర్లు మొబైల్‌ యాప్‌ ద్వారా పనుల పురోగతిని నేరుగా నమోదు చేస్తారు. పనులు పూర్తయిన వెంటనే రియల్‌టైమ్‌ ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం ఉన్నతాధికారి ఆ సమాచారాన్ని పరిశీలించి ఆమోదించిన తర్వాత అధికారిక రికార్డుల్లో చేరుతుంది. దీంతో తప్పుడు నివేదికలకు అవకాశం తగ్గడమే కాకుండా వాస్తవ పరిస్థితి ప్రభుత్వానికి నేరుగా తెలుస్తుంది.


అడ్డంకులకు ప్రత్యేక ట్రాకింగ్‌..

రైల్వే, జాతీయ రహదారులు, అటవీశాఖ, భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీ, యుటిలిటీ మార్పులు, కాలువల అనుమతులు వంటి కారణాలతో నిలిచిపోయిన పనులను ఈ వ్యవస్థలో ప్రత్యేకంగా నమోదు చేస్తారు. ఈ సమస్య ఏ శాఖ పరిధిలో ఉందో గుర్తించి సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారం వచ్చే వరకు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతో ఫీల్డ్‌ ఇంజనీర్లు అనుమతుల కోసం తిరగాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

భారీ ప్రాజెక్టులు

నీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ‘అమృత్‌ 2.0’, ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ), అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(యూఐడీఎఫ్‌) మొదటి, రెండో విడతలు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 పథకాల కింద మొత్తం రూ.19,561 కోట్లతో 800 ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్త వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు, పైప్‌లైన్లు, క్లియర్‌ వాటర్‌ ట్రాన్స్‌మిషన్‌ మెయిన్‌లు, మొదులుకుని ఇంటింటికీ నీటి కనెక్షన్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థలు, ఓఎస్టీపీ ల నిర్మాణం జరుగుతోంది.

బిల్లుల ప్రక్రియలో మార్పు

సంప్రదాయ పద్ధతిలో కాంట్రాక్టర్ల బిల్లుల పరిశీలన, ఆమోదం, చెల్లింపులకు 20 నుంచి 25 రోజులు పడుతోంది. ఓడబ్ల్యూఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా వారం లోపే బిల్లులు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరిగి పనులు నిలిచిపోకుండా వేగంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఓడబ్ల్యూఎంఎస్‌ విజయవంతం కావాలంటే అధికారులు వ్యవస్థను సమర్థంగా వినియోగించాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఫీల్డ్‌ ఇంజనీర్లు, మున్సిపల్‌ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు, ప్రాజెక్టు మేనేజర్లు, ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. మొబైల్‌ యాప్‌ వినియోగం, ఫొటో అప్‌లోడ్‌, డేటా ధృవీకరణ, అడ్డంకుల గుర్తింపు, బిల్లుల ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై విస్తృతంగా శిక్షణ ఇచ్చింది. ప్రాజెక్టులకు నిధులు మంజూరుచేయడం మాత్రమే కాదని, అవి పూర్తిస్థాయిలో పనిచేసి ప్రజలకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌. సురేశ్‌కుమార్‌ చెబుతున్నారు.


ఆదర్శంగా ఏపీ మోడల్‌!

ప్రపంచ వ్యాప్తంగా పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో సమన్వయం, పర్యవేక్షణ ప్రధాన సవాలుగా ఉన్న సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓడబ్ల్యూఎంఎస్‌ మోడల్‌ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్‌ టెక్నాలజీ, ఫీల్డ్‌ ఆధారాలు, బాధ్యతాయుత పరిపాలన, వేగవంతమైన నిర్ణయాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పట్టణ నీటి భద్రతలో రాష్ట్రం కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Jul 13 , 2026 | 03:20 AM