భధ్రంగా భూమి
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:43 AM
ప్రస్తుతం రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ పూర్తిగా రెవెన్యూ శాఖ చేతుల్లో ఉంది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల భౌతిక రికార్డులను డిజిటలైజ్‌చేసి వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచారు.
రెవెన్యూ రికార్డులకు ‘డిజిటల్ లాక్’రైతు వద్దే దాని పాస్‌వర్డ్
రికార్డుల తారుమారు కుదరదు
వెబ్‌ల్యాండ్ 2.0లో సరికొత్త ఫీచర్
సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం
రెవెన్యూ సంస్కరణల్లో కొత్త అధ్యాయం
కొత్తగా భూవివాదాలు ఏర్పడకుండా చెక్
ఇక కొత్తగా భూ వివాదాలను సృష్టించలేరు! అసలు రైతుకు తెలియకుండా రాత్రికి రాత్రి భూమి రికార్డులను మార్చేయలేరు. లేని వివాదాన్ని సృష్టించి... రైతులను తమ చుట్టూ తిప్పుకోలేరు! ఎలాంటి వివాదాలు లేని, స్పష్టమైన రికార్డులున్న భూములపై నియంత్రణ సంబంధిత రైతుదే! మనం బయటికి వెళితే ఇంటికి తాళం వేసుకున్నట్లుగా... భూమి రికార్డులకు ‘డిజిటల్ లాక్’ వేసుకోవచ్చు. దాని ‘తాళం’ (పాస్‌వర్డ్) రైతు వద్దే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను కొత్త ఫీచర్లతో అభివృద్ధి చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే రైతుల ప్రమేయం లేకుండా, వారి ఈ-కేవైసీతో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు కూడా రికార్డులను మార్చలేరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానే గాక, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్న జి.సాయిప్రసాద్ చొరవతోనే ఈ ప్రత్యేక డిజిటల్ లాక్ ఆలోచనతెరపైకి వచ్చినట్లు తెలిసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రస్తుతం రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ పూర్తిగా రెవెన్యూ శాఖ చేతుల్లో ఉంది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల భౌతిక రికార్డులను డిజిటలైజ్‌చేసి వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచారు. వెబ్ ల్యాండ్‌కు చట్టబద్ధత కల్పించడంతోపాటు ఇందులోని రికార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అయితే కొందరు రెవెన్యూ అధికారులు లాభాపేక్షతో రాత్రికి రాత్రే రైతుల ప్రమేయం లేకుండా భూ రికార్డులను మార్చేస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి. ఇలాంటి ఆరోపణలపై పలువురు రెవెన్యూ అధికారులు విచారణ ఎదుర్కొని సస్పెండయ్యారు కూడా.
తహసీల్దార్ వద్ద ఉండే డిజిటల్‌కీ దుర్వినియోగం అవ్వడం.. లేదంటే భూ బకాసురులు, కబ్జాదారులతో కొందరు అధికారులు కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసిన ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీటి వల్ల భూ వివాదాలు, తగాదాలు మరింతగా పెరిగిపోతున్నాయి. తప్పుచేసిన అధికారులపై ప్రభుత్వం ఒకపక్కన కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మరోపక్క అడదపాదడపా ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతుల భూములకు భద్రత కల్పించేందుకు వెబ్‌ల్యాండ్ 1.0 స్థానంలో 2.0ను రెవెన్యూ శాఖ అబివృద్ధి చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌లోనే అనేక రక్షణ ఫీచర్లను జోడించి రైతుల భూములకు భద్రత కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం షేర్‌మార్కెట్‌లో ఓ విధానం అమల్లో ఉంది. ఒక వ్యక్తి ఏవైనా షేర్లు కొంటే.. తన ప్రమేయం లేకుండా ఆ షేర్లు వేరే కంపెనీకి లేదా వ్యక్తులకు బదిలీ కాకుండా లాక్ చేసుకునే వెసులుబాటుఉంది. ఒకవేళ ఆ షేర్లు అమ్మాలన్నా.. ఇతరులు కొనాలన్నా కచ్చితంగా వాటి హక్కుదారు అమోదం ఉండాలి. ఇదే తరహాలో రాష్ట్ర రెవెన్యూ శాఖలో కూడా డిజిటల్ రికార్డులను అసలైన హక్కుదారులే డిజిటల్ లాక్ చేసుకుని భద్రపరచుకునేలా నూతన విధానం తీసుకురావాలని సీఎస్ జి.సాయిప్రసాద్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ దిశగా వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేపట్టాలని సిఫారసు చేసినట్లు సమాచారం. దీంతో అసలిది అమలు చేయడం సాధ్యమా.. సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అన్న అంశాలపై పరిశీలన జరిగింది. భూ రికార్డులకు డిజిటల్ లాక్‌లు ఏర్పాటుచేసుకోవచ్చని, ఈ దిశగా వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయవచ్చని సాంకేతిక నిపుణులు సూచించడంతో ఆ మేరకు మార్పులు చేయాలని సీఎస్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం డిజిటల్ లాక్‌ను తీసుకొచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
డిజిటల్ లాక్ ఇలా..: రాష్ట్రంలో భూముల సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 7 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. రైతుల వివరాలన్నిటినీ వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానిస్తున్నారు. వారి ఆధార్‌ను కూడా వారి భూమి ఖాతాలతో సీడింగ్ చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం సమయంనే రైతుల వేలిముద్రలు, ఇతర కీలకమైన డేటా నమోదుచేస్తున్నారు. వీటి ఆధారంగా భూమి రికార్డు పక్కాగా ఉన్న రైతులకు డిజిటల్ లాక్ సదుపాయం కల్పించనున్నారు. అంటే ఆ రైతుకు ఉన్న భూమి విస్తీర్ణం, సర్వే నంబర్, సరిహద్దుల్లో ఎలాంటి వివాదం లేదనుకుంటే.. ఆ రైతుకు వెబ్‌ల్యాండ్ రికార్డుపై డిజిటల్ లాక్ ఇస్తారు. అది అంకెలు, అక్షరాలతో కూడుకున్న పాస్‌వర్డ్. ఇది రైతు వద్దే ఉంటుంది. ఒక్కసారి ఆ పాస్‌వర్డ్‌తో రైతు తన భూమి రికార్డును డిజిటల్ లాక్‌చేసుకున్నాక ఆ భూమిని అధికారులు కూడా కదల్చలేరు. ఆ రికార్డును వారు తమ లాగిన్ ద్వారా మార్చలేరు. రైతు కచ్చితంగాఆ డిజిటల్ లాక్ పాస్‌వర్డ్ ద్వారా అన్‌లాక్ చేసిన తర్వాతే ఆ రికార్డును మార్చడానికి వీలుండేలా సాఫ్ట్‌వేర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పక్కాగా ఉన్న రికార్డులకు ఇలాంటి డిజిటల్ లాక్ సదుపాయం కల్పించనున్నారు. ఒక్కసారి రైతు తన భూమిని డిజిటల్ లాక్‌చేసుకున్నాక.. ఆ భూమిని మ్యుటేషన్, ఇతర సేవల్లో కూడా చూపించకుండా ఏర్పాట్లు చేస్తారు. అంటే అక్రమ రిజిస్ట్రేషన్లు, రికార్డులను మార్చడానికి కూడా ఎవరికీ ఏ స్థాయిలోనూ అవకాశం లేకుండా డిజిటల్ లాక్ ద్వారా అన్నింటినీ బ్లాక్ చేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేశాక తొలుత కొన్నిగ్రామాల్లో పైలట్‌గా అమలు చేసే అవకాశంఉంది. సాఫ్ట్‌వేర్ పరిశీలన జరిగి.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాక అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈవిధానం దేశంలో ఎక్కడా లేదు. అమల్లోకి వస్తే వస్తే డిజిటల్ రికార్డులకు లాక్ వెసులుబాటు కల్పించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకెక్కనుంది.