ఇక యాప్‌లో ఎరువులు
ABN , Publish Date - May 21 , 2026 | 05:02 AM
ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం డిజిటల్ విధానం అమల్లోకి తెస్తోంది. అక్రమ తరలింపు, వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అవసరానికి మించి కొనుగోళ్లను నియంత్రించే లక్ష్యంతో ...
అక్రమాల కట్టడికి కొత్తగా డిజిటల్ విధానం
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం డిజిటల్ విధానం అమల్లోకి తెస్తోంది. అక్రమ తరలింపు, వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అవసరానికి మించి కొనుగోళ్లను నియంత్రించే లక్ష్యంతో యాప్‌ను రూపొందించింది. కౌలురైతులతో సహా అసలైన సాగుదారులకు రాయితీ ఎరువులను అందించడానికి, ఎరువుల వినియోగాన్ని సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి ఈ డిజిటల్ వ్యవస్థను వ్యవసాయశాఖ తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఏపీఎయిమ్స్) 2.0 ద్వారా ఎరువుల పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీంతో రైతులు తమకు కావాల్సిన ఎరువుల్ని ముందుగానే యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రైతుకు సీజన్‌లో గరిష్ఠంగా 50 బస్తాల ఎరువులు అందేలా ఈ ఏపీఎయిమ్స్ యాప్‌ను రూపొందించారు. జాతీయ స్థాయిలో ఐఎ్‌ఫఎంఎస్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తూ, ఈ యాప్‌ను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్‌లో ఎరువులు బుక్ చేసుకుంటే.. ఎమ్మార్పీ ప్రకారం సొమ్మును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ షాపులో చెల్లించవచ్చు. పంట దశను బట్టి యాప్ ద్వారా టోకెన్ జారీ అవుతుంది. టోకెన్ ఉంటేనే ఎరువును తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులు కావాల్సిన ఎరువులను సమీప డీలర్ వద్ద డెలివరీ తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. దీని వల్ల యూరియా, డీఏపీ వంటి ఎరువుల డిమాండ్‌పై వ్యవసాయశాఖకు కచ్చితమైన సమాచారం అందుతుంది. అలాగే ఈ-పంట నమోదు ప్రామాణికంగా ఎంత విస్తీర్ణంలో రైతులు పంటలు వేఽశారో.. ఎరువులు ఎంత కొనుగోలు చేశారో కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి వచ్చే ఏడాది ఎరువుల ప్రణాళిక తయారు చేయడం సులభం అవుతుంది. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచే కొత్త విధానం అమలు చేయనున్నారు.
ఎరువుల కొరత లేదు
రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు జూలై నెల వరకు సరిపడా నిల్వలున్నట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదించింది. ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రానికి వివిధ రకాల రసాయన ఎరువులు 18.09 లక్షల టన్నులు కేంద్రం కేటాయించింది. ఇందులో యూరియా 7.5, డీఏపీ 2.5, ఎంవోపీ 0.99, కాంప్లెక్స్ 6.1, ఎస్ఎస్పీ 1.00 లక్షల టన్నుల కేటాయించింది. గత ఏప్రిల్ నాటికి ప్రారంభనిల్వ 7.13 లక్షల టన్నులు ఉండగా, 2.34లక్షల టన్నులు ఇప్పటికే సరఫరా అయ్యింది. దీంతో 9.47లక్షల టన్నుల ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఏప్రిల్, మే నెలల్లో 1.14 లక్షల టన్నులు అమ్ముడుపోయాయని అధికారులు చెప్తున్నారు. ఈనెల 17 నాటికి 8.93 లక్షల టన్నుల ఎరువుల లభ్యత ఉంది. గత మూడేళ్లలో ఖరీఫ్ సీజన్‌లో సగటు అమ్మకాలు 16.28 లక్షల టన్నులుగా రికార్డయింది. కాగా, ఈనెల 17 నాటికి మే నెల ప్రణాళిక, సరఫరా, అమ్మకాలను పరిశీలిస్తే.. అన్ని రకాల ఎరువులు గత మూడేళ్ల సగటు అమ్మకాలు 78,491 టన్నులుగా రికార్డయింది. ఏప్రిల్, మే నెలల్లో వ్యవసాయ పంటలు లేకపోయినా.. కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలకు రైతులు కొనుగోలు చేస్తున్నారని డీలర్లు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.63 లక్షల టన్నుల యూరియా, 95 వేల టన్నుల డీఏపీ నిల్వలున్నాయి. ఇవన్నీ జూలై నెల వరకు సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. యూరియా పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 10 రోజుల వ్యవధి ప్రణాళిక విధానాన్ని అమలు చేస్తోంది. యూరియా, డీఏపీ నిల్వలు కనీసం 21 రోజులకు సరిపడా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖరీఫ్‌కు అవసరమైన యూరియా పరిమాణంలో 45 శాతం ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేశారు.
దుర్వినియోగం చేస్తే దండనే..
వ్యవసాయ గ్రేడ్ యూరియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న పరిశ్రమలను అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారు. ఇందులో ప్లైవుడ్, పెయింట్, ఇథనాల్, పశువుల మేత, టెక్స్‌టైల్ తదితర రంగాల పరిశ్రమలున్నాయి. అయితే ఏపీకి కేటాయించిన యూరియా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాకు అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. రైతులకు అవసరం లేని రకాలను కూడా డీలర్లు అమ్ముతున్నట్లు ఫిర్యాదులున్నాయి. గత మూడేళ్ల సగటు అమ్మకాలతో పోల్చి, ప్రస్తుత సంవత్సరంలో యూరియా, డీఏపీ అధికంగా విక్రయించిన డీలర్లను విచారించి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి ఉదంతాలు నంద్యాల, కర్నూలు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 76 మంది డీలర్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే రూ. 5.41 కోట్ల విలువైన 2,642 టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశామని అధికారులు చెబుతున్నారు.
ఎరువులు పక్కదారి పట్టిస్తే.. డీలర్ లైసెన్సు రద్దు: అచ్చెన్న
రైతులకు అందాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఎరువులను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమంగా నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించడం వంటి వ్యవహారాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని ఒక ప్రకటనలో మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, విజిలెన్స్ నిఘా పెట్టాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీని ఆదేశించారు. డీలర్లు ఎరువులు పక్కదారి పట్టించినట్లు రుజువైతే లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అక్రమాలకు కారణమయ్యే వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ జరపాలన్నారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజు వారీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు.