అన్ని అడ్మిషన్లకు ఒకే పోర్టల్
ABN , Publish Date - May 18 , 2026 | 04:11 AM
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరేందుకు పలు రకాల సైట్లను విద్యార్థులు అన్వేషిస్తుంటారు. ఇంటర్‌లో గ్రూపు ఆధారంగా ఉన్నత విద్యలో దానికి సంబంధించిన కోర్సును ఎంపిక చేసుకుంటారు.
ఉన్నత విద్యలో కీలక మార్పు
ఒక్క రిజిస్ర్టేషన్‌తో ఏ కోర్సులకు అర్హత ఉందో తెలుసుకోవచ్చు
నచ్చిన వాటికి అక్కడే దరఖాస్తు
కుల ధ్రువీకరణ పత్రం అక్కర్లేదు
పత్రాలన్నీ ఆధార్‌తో అనుసంధానం
ఉన్నత విద్య పూర్తయ్యేదాకా విద్యార్థుల ట్రాకింగ్‌కు ప్రణాళిక!
ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు
ఇంటర్మీడియట్ పూర్తయిన వారు.. ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతరత్రా కోర్సులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటున్నారా..?. పలు రకాల వెబ్ సైట్లను తెగ అన్వేషిస్తున్నారా?.. అయితే.. ఇక నుంచి వేర్వేరు వెబ్‌సైట్లకు వెళ్లి వెతకడం, రిజిస్ర్టేషన్లు చేసుకోవడం, అర్హతలు పరిశీలించుకోవడం లాంటి గందరగోళం ఉండదు. ఉన్నత విద్యాశాఖ తాజాగా ‘కామన్ పోర్టల్’ను అందుబాటులోకి తెస్తోంది. దీంతో అభ్యర్థులకు తగిన కోర్సుల ఎంపికతో పాటు దరఖాస్తు ప్రక్రియ కూడా చిటికెలో పూర్తికానుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరేందుకు పలు రకాల సైట్లను విద్యార్థులు అన్వేషిస్తుంటారు. ఇంటర్‌లో గ్రూపు ఆధారంగా ఉన్నత విద్యలో దానికి సంబంధించిన కోర్సును ఎంపిక చేసుకుంటారు. దీనికిగాను పలు రకాల సైట్లను వెతుకుతారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఒకే పోర్టల్ అందుబాటులోకి రానుంది. దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి.. ఏ కోర్సుకు వారు అర్హులో తెలియడంతోపాటు.. దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఉంటుం ది. ఈ కొత్త విధానాన్ని 2026-27 విద్యా సం వత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చే దిశగా ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
కామన్ పోర్టల్ ఎందుకంటే..
ప్రస్తుత విధానంలో అడ్మిషన్లను వేర్వేరు శాఖలు చేపడుతున్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశాలను సాంకేతిక విద్యాశాఖ.. డిగ్రీ, బీఈడీ అడ్మిషన్లను ఉన్నత విద్యామండలి.. ఇతర కోర్సులను సంబంధిత సంస్థలు చేస్తున్నాయి. దీనికోసం ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్ కామన్‌గా ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రతి కోర్సుకు వేర్వేరుగా రిజిస్ర్టేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక నుంచి అన్ని రకాల ఉన్నత విద్య అడ్మిషన్లను ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ స్వయంగా చేపట్టనుంది. దీనికి అనుగుణంగా ఉన్నత విద్య అడ్మిషన్ల ‘కామ న్ పోర్టల్’లో ఒక్కసారి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. విద్యార్థి ఇంటర్‌లో గ్రూపు వివరాలతో పోర్టల్‌లో ప్రొఫైల్ తయారుచేసుకుంటే అతడు ఏ కోర్సులకు అర్హుడో అక్కడ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ప్రవేశపరీక్షలు, ఇంటర్ మార్కు ల ఆధారంగా ఒక్క క్లిక్‌తో ఆయా కోర్సుల కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. విద్యార్థి తనకు ఏ కోర్సులో చేరేందుకు అర్హత ఉందనే విషయంపై అక్కడే స్పష్టత వస్తుంది.
ఆధార్‌తోనే అన్నీ
కొందరు విద్యార్థులకు డిమాండ్ ఉండే రెగ్యులర్ కోర్సులు మినహా వైవిధ్యంగా ఉండే ఇతరత్రా కోర్సులపై అవగాహన ఉండడం లేదు. అలాంటి వారికి కామన్ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే, ప్రస్తుత విధానంలో రిజర్వేషన్ ఉన్న విద్యార్థులు వారి కుల ధ్రువీకరణ పత్రాలను అడ్మిషన్ల కోసం అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కనీసం ధ్రువీకరణ పత్రం నంబరునైనా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఇకనుంచి కేవలం ఆధార్ నంబరు ఇస్తే సరిపోతుంది. ఆధార్ నంబర్లతో కుల ధ్రువీకరణ సహా అన్ని ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. విద్యార్థి తన ఆధార్ నంబరు ఇవ్వగానే అతను ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి అనే వివరాలు అక్కడ కనిపిస్తాయి.
ట్రాకింగ్ చేసే ప్రణాళిక..
విద్యార్థులను ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ట్రాకింగ్ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. పదో తరగతి అనంతరం విద్యార్థి ఏం చేస్తున్నాడు?. ఇంటర్‌లో చేరుతున్నాడా?. ఇతర రాష్ర్టాల్లో చదివేందుకు వెళ్లాడా?. డ్రాపౌట్ అయ్యాడా?.. ఇక్కడ చదివితే ఏ కోర్సులో చేరాడనే వివరాలతో విద్యార్థుల అకడమిక్ కెరియర్‌ను ట్రాకింగ్ చేయాలని నిర్ణయించింది. ఏటా టెన్త్‌లో లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. అయిన్నప్పటికీ వారిలో కొందరు ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇతర కోర్సుల్లో చేరడం లేదు. వారు ఏమయ్యారో తెలుసుకునే విధానం లేదు. అలాగే ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏ కోర్సులో ఎంతమంది చేరారనే వివరాలను ఒకచోట నుంచి తీసుకునే వెసులుబాటు లేదు. వేర్వేరు శాఖలు అడ్మిషన్లు చేపడుతున్నందున వివరాల సేకరణలో సమన్వయలోపం కనిపిస్తోంది. ఉమ్మడి పోర్టల్ విధానంతో విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలుసుకుని వారిని ఉన్నత విద్య కోర్సుల దిశగా ప్రోత్సహించే వెసులుబాటు కలుగుతుంది. అలాగే ట్రాకింగ్ వల్ల వారి నైపుణ్యాలను గుర్తించి ఎప్పటికప్పుడు నైపుణ్యాల మెరుగుదలకు చర్యలు చేపడతారు.