పిల్లలే సంపద!
ABN , Publish Date - May 18 , 2026 | 04:42 AM
‘పిల్లలే మన సంపద.. వారే మన భవిష్యత్’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త జనాభా నిర్వహణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు..
జనాభా వృద్ధి కోసం రాష్ట్రంలో కొత్త కార్యక్రమం
మానవ వనరుల కొరత అధిగమించేందుకు ప్రభుత్వం సమాయత్తం
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘పిల్లలే మన సంపద.. వారే మన భవిష్యత్’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త జనాభా నిర్వహణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. మున్ముందు తీవ్ర మానవ వనరుల కొరతకు, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని గుర్తించి.. జనాభా వృద్ధిని ప్రోత్సహించేలా ’పిల్లలే సంపద’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ ముసాయిదా ఆధారంగా ఈ సరికొత్త విధానంపై మరింత లోతుగా చర్చించి అందరి అభిప్రాయం తీసుకుని అమలుచేయాలనేది కూటమి సర్కారు ఆలోచన. ఇందులో భాగంగా ఇకపై జనాభా నియంత్రణకు బదులు, జనాభా వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇద్దరిని మించి.. మూడో బిడ్డకు జన్మనిస్తే రూ.30,000, నాలుగో బిడ్డకు రూ.40,000 చొప్పున ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తోంది. ప్రస్తుతం కుటుంబ నియంత్రణ విధానాలు అవలంబించిన చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జర్మనీ వంటి దేశాలు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. జనాభా తగ్గడం వల్ల భవిష్యత్‌లో మానవవనరుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున ఈ కొత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభుత్వం అంటోంది. ఆర్థిక ప్రగతి కోసం జనాభా వృద్ధి తప్పనిసరని అభిప్రాయపడుతోంది.